/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
మధ్యప్రాఛ్య యుద్ధంలో ఇరాన్ దిగి వచ్చింది. దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ అణు వివాదం ముగింపు దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా నుంచి గౌరవప్రదమైన 'ఆఫర్' వస్తే, తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడానికి సిద్ధమని ఇరాన్ అనూహ్య ప్రకటన చేసింది. సాధారణంగా ఇరాన్ తన అణు కార్యకలాపాలపై చర్చలు జరిగినప్పుడు "యురేనియం సుసంపన్నత తగ్గిస్తాం" అని మాత్రమే చెప్పేది. కానీ, మొదటిసారిగా మొత్తం అణు కార్యక్రమాన్నే ముగించేస్తామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఖతీబ్జాదే ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ మేరకు 'స్కై న్యూస్ అరేబియా' న్యూస్ రాసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో శాంతికి కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
శాంతి కోసం 12 దేశాల రాయబారం
అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి 12 మధ్యప్రాచ్య దేశాలు మధ్యవర్తులుగా పనిచేస్తున్నాయి. టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నారు. ఒమన్, సౌదీ అరేబియా దేశాలు ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదర్చడానికి అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే జెనీవా, ఒమన్‌లలో ఇరు దేశాల ప్రతినిధులు రహస్యంగా సమావేశమైనట్లు 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
ఇరాన్ అణు సామర్థ్యం
డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్ అణు నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ వద్ద 460 కిలోగ్రాముల శుద్ధి చేసిన యురేనియం ఉంది. ఈ నిల్వలతో దాదాపు 11 అణు బాంబులను తయారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది 60% స్థాయిలో ఉంది. అణ్వాయుధ తయారీకి ఇది 90% కి చేరాల్సి ఉంటుంది.
రంగంలోకి కీలక నేతలు
ఈ చారిత్రక ఒప్పందం కోసం ఇరు దేశాల నుంచి అత్యున్నత స్థాయి ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, ఉప మంత్రి ఖతీబ్జాదే పాల్గొంటుండగా.. అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్‌తో పాటు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా ఆంక్షలు, దాడుల హెచ్చరికలు తీవ్రమైన వేళ ఇరాన్ ఈ ప్రతిపాదన చేయడం ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా ఇచ్చే ఆఫర్ "గౌరవప్రదంగా" ఉంటే, దశాబ్దాల శతృత్వం ముగిసి మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. అయితే, ట్రంప్ యంత్రాంగం ఈ ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందనే దానిపైనే ప్రపంచం దృష్టి నిలిచింది.
Follow Us