/rtv/media/media_files/2026/03/09/bapco-2026-03-09-18-24-24.jpg)
Bapco oil refinery
Iran- Israeli War :ఇరాన్– ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం.. దాదాపు పది రోజులు గడిచినా ఓ కొలిక్కి రావడం లేదు. అమెరికా– ఇజ్రాయిల్ సంయుక్తంగా తమపై దాడి చేస్తున్నప్పటికీ.. ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం మధ్య ప్రాచ్యా ప్రాంతాన్నంతా హింసలోకి నెట్టింది. ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుండగా ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ క్రమంలో, ఇరాన్ ఈ రోజు బహ్రెయిన్‌లో ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం బాప్కో (BAPCO) ను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.కర్మాగారంపై ఇరాన్ దాడి తర్వాత ఆ ప్రాంతం చుట్టూ దట్టమైన పొగ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులకు ప్రతీగా ఇరాన్ తన డ్రోన్ లతో దాడులకు దిగింది. దీని కారణంగా సిత్రా ప్రాంతంలో.. పలువురికి గాయాలు కాగా, పెత్త ఎత్తున ఆస్తి నష్టాలు చోటు చేసుకున్నాయని విశ్వాసనీయ వర్గాలు వెల్లడించాయి.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా సోమవారం షైబా చమురు క్షేత్రం వైపు దాడి చేసేందుకు వెళుతున్న నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ లోని రబ్ అల్-ఖలీ ఎడారి మీదుగా వెళ్తున్న డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు సౌదీ వెల్లడించింది.
ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడులకు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు గట్టి సమాధానం చెబుతున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పష్టం చేసింది. అంతేకాక ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులను, రియాద్‌పై డ్రోన్ దాడులను ఇప్పటికే భగ్నం చేశామని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ తన దాడుల లక్ష్యాన్ని మార్చింది. ప్రస్తుతం మధ్య ఇరాన్‌లో కొత్త దాడులను మొదలుపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. లెబనీస్ రాజధాని బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు అల్ జజీరా తమ నివేదికలో వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన.. వైమానిక దళ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ప్రధాన కార్యాలయం “బాలిస్టిక్ క్షిపణి కమాండ్, మానవరహిత వైమానిక వాహన (UAV) శ్రేణి , ఇతర వైమానిక దళ విభాగాలుగా” పనిచేస్తుందని ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. సౌదీలో ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని అమెరికా తన రాయబార కార్యాలయ సిబ్బందిని ఆదేశించింది. ఇక ఈ దాడుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం కనపడుతోందని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై భారీ దాడులకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Follow Us