Donald Trump: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయులు, హిందువులకు మద్దతుగా నిలిచాడు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కొనసాగిస్తున్న ట్రంప్.. దీపావళి పండుగ వేళ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తాను గెలిస్తే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని చెప్పారు. బైడెన్, కమలా హారిస్ హిందువులను పట్టించుకోలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
నా పాలనలో ఇలా జరగలేదు..
‘బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మతస్థులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశారు. నా పాలనలో ఇలా జరగలేదు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారు. మేము అధికారంలోకి వస్తే అమెరికాను బలంగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పుతాం. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతాం. నా స్నేహితుడు మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటాను’ అన్నారు ట్రంప్.
పన్నులు, నిబంధనల్లో కోత..
అలాగే కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుందన్నారు. తాను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తానని, అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తానని చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతా. అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతా. దీపావళి పండగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నా అని ట్రంప్ చెప్పుకొచ్చారు.