/rtv/media/media_files/2025/01/21/2dxVduIcIHw4lBeChdei.jpg)
who trump Photograph: (who trump)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కరోనా వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అతిపెద్ద డోనర్. అమెరికా తప్పుకోవడం వల్ల డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు స్తంభించిపోతాయి.
ట్రంప్ తాజా ఆదేశాలతో ఆ సంస్థకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్‌లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది. డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల ప్రకారం.. 2024-25 బడ్జెట్ లో యూఎస్ విరాళాలు 662 మిలియన్లు ఉన్నాయి. ట్రంప్ తన తొలి హయాంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పారిస్ వాతావరణ మార్పు ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒప్పందం ఒకవైపు మాత్రమే ఉందని... న్యాయంగా లేదని తెలిపారు.
1500 మందికి క్షమాభిక్ష
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. అంతేకాకుండా ఆరుగురి శిక్షలను కూడా తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. దీంతో ఈ రోజు రాత్రికి వారు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని యూఎస్ అటార్నీ జనరల్‌ను కూడా నిర్దేశించారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల టైమ్ లో ట్రంప్ ప్రకటించగా తాజాగా ఆ దిశగానే ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అమెరికా అధ్యక్షుడు తనకు కావాల్సిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలాగే యుద్ధాల్లాంటివి జరిగినప్పుడు సంక్షోభాల నివారణ చేయడానికి ఈ ఆదేశాలు జారీ చేయొచ్చు. అమెరికాలో ఇప్పటికే వేల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ అందరికన్నా అత్యధికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారని చెబుతారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొత్తం 220 ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇక గత ప్రభుత్వంలో బైడెన్ 160 ఆర్డర్ల మీద సంతకం చేశారు. అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే ట్రంప్ వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేయడం మాత్రం రికార్డ్ అనే చెప్పాలి.
Also Read : కొత్త రేషన్ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు