Woman President In America:
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది.ప్రస్తుతం మొత్తం ప్రపంచం దృష్టి అంతా ఈ ఎన్నికలపైనే ఉంది. వచ్చే అధ్యక్షులు బట్టి చాలా సమీకరణాలు మారిపోతాయి. అందులోనూ అగ్రరాజ్యం. అందుకే ఇక్కడ ఎన్నికల వేడి ప్రపంచం అంతా ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు కూడా కమలా హారిస్ మళ్ళీ ట్రంప్ మీదనే పోటీ చేస్తున్నారు.
అమెరికా ఒక దేశంగా తయారై 235 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ళల్లో 46 మంది అధ్యక్షులు ఎన్నికయ్యారు. కానీ ఇందులో ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందా...అలా అయితే అగ్రరాజ్యంలో పురుషాధిక్యత ఉందనే చెప్పాలేమో అని రాజకీయ నిపుణులు అంటున్నారు. దానికన్నా మహిళ పట్ల వివక్ష అనడం సబబు అని కూడా అంటున్నారు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో మహిళ కమలాహారిస్ నిలబడ్డారు. ఇప్పుడు ఈమె కూడా ట్రంప్‌కు గట్టి పోటీనే ఇస్తున్నారు. సర్వేలు కూడా కచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నాయి. అయితే ఒకటి, రెండు శాతాలు ట్రంప్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నాయి. అలా అయితే మహిళకు మళ్ళా అధ్యక్ష పదవి పోయినట్టు అవుతుంది.
సమానత్వమని గొప్పగా చెప్పుకుంటారు...
అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో స్వేచ్ఛా, సమానత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. ఇక్కడ అందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి కూడా. కానీ దేశ అధ్యక్ష పదవి దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే రెండు ప్రధాన పార్టీల్లో ఎప్పుకోదగ్గ సంఖ్యలో మహిళా నేతలు లేకపోవడం ఒక కారణం అయితే. ఉన్నవారికి కూడా సపోర్ట్ అంతంత మాత్రమే అంటున్నారు. అమెరికాలో ప్రధాన పార్టీలు రెండూ కూడా మహిళలను అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచడం మహిళా వివక్షగానే చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్ష బరిలో నిలబడిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు కమలా హారిస్ భారత, ఆఫ్రికన్ మూలాలు కలిగిన మహిళగా రికార్డ్ ఉంది. మరి ఈసారి అయినా అమెరికన్లు మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంటారా...
పురుషుల ఓటు ట్రంప్‌కే..
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం తెలుస్తోంది. ఎన్నికల మీద నిర్వహిస్తున్న సర్వేల్లో పురుషులు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ట్రంప్‌కు మద్దతు ఇస్తుంటే...మహిళలు, కమలా హారిస్‌కు మద్దతిస్తున్నారు. దీంతో ఫలితాలను నిర్ణయించడంలో లింగ వివక్ష కీలక అంశంగా మారింది. అయితే కమలా హారిస్ మాత్రం ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు. దాన్ని ప్రచారాంశంగా మలచుకునే ప్రయత్నమూ చేయలేదు. జాతి , జెండర్ ప్రమేయం లేకుండా అమెరికన్లు తనకు మద్దతునివ్వాలి కోరుతున్నారు. మరోవైపై ట్రంప్ కూడా జెండర్ గురించి డైరెక్ట్‌గా మాట్లాడడం లేదు. కానీ కమలా హారిస్ బలహీనురాలు అంటూ చాలాసార్లు ప్రచారం చేశారు. నిజాయితీ లేని వ్యక్తి, ప్రమాదకరమైన ఉదారవాది అంటూ మాటలాడారు. ఇది లింగ వివక్ష కిందకే వస్తుందని అంటున్నారు. ఇక అధ్యక్ష అభ్యర్థుల్లోని ఈ లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రయాన్ లాంజా బాహాటంగానే అన్నారు.
Also Read: నస్రల్లా మార్గమే నాది కూడా..హెజ్బుల్లా కొత్త ఛీఫ్ మొదటి ప్రసంగం