/rtv/media/media_files/2026/01/23/fotojet-6-2026-01-23-10-02-03.jpg)
USA: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వలసదారులపై ట్రంప్ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. కాగా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇప్పటికే విమర్శల పాలు కాగా, తాజాగా అక్కడ ఓ ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. మిన్నెసోటాలోని ప్రీస్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఆ చిన్నారితో పాటు అతడి తండ్రిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని టెక్సాస్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారని ప్రీస్కూల్ అధికారులు, బాధిత కుటుంబ న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నారి అధికారుల నిర్బంధంలోనే ఉన్నాడు.
కాగా ఈ విషయమై స్కూల్ సిబ్బంది మాట్లాడుతూ.. నిర్బంధించిన బాలుడి పేరు లియామ్ కోనెజో రామోస్ అని తెలిపారు. 2024లో ఈ చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చిందన్నారు. బహిష్కరణకు సంబంధించి వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇమిగ్రేషన్ అధికారులు బాలుడిని లక్ష్యంగా చేసుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ప్రతినిధి ట్రిసియా మెక్‌లిఫ్లిన్ స్పందించారు. చిన్నారి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్ ఈక్వెడార్ జాతీయుడని తెలిపారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న అతడిని.. అదుపులోకి తీసుకునేందుకు ఇమిగ్రేషన్ అధికారులు (ICE) ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పిల్లాడి భద్రత కోసం ఓ అధికారి అతడితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
పిల్లాడి నిర్బంధంపై వస్తున్న విమర్శలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ఇమిగ్రేషన్ అధికారులు చిన్నారి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఇక,ఈ ఘటనను యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తీవ్రంగా స్పందించారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Follow Us