Ahmedabad : కాంగ్రెస్ ఎంపీ మేనల్లుడు భార్యను చంపి ఆత్మహత్య.. బయటపడ్డ అసలు నిజాలు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్‌సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.

New Update
Yashkumarsinh

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్‌సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన కాల్పులుగా భావించినప్పటికీ, ఫోరెన్సిక్ నివేదికలు, ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు దీనిని పక్కాగా ప్లాన్ చేసిన హత్యగా నిర్ధారించారు. భార్యను కాల్చి చంపిన తర్వాతే యశ్ కుమార్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేస్తూ, అతనిపై హత్య కేసు నమోదు చేశారు.

పెళ్లై రెండు నెలలు

అసలేం జరిగిందంటే.. వస్త్రాపూర్ ప్రాంతంలోని ఎన్ఆర్ఐ టవర్స్‌లో నివసిస్తున్న ఈ జంటకు వివాహమై కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది. జనవరి 21 రాత్రి గొడవ జరగడంతో, తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో యశ్ కుమార్ తన భార్య తలపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తానే స్వయంగా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని రాజేశ్వరి అప్పటికే చనిపోయిందని నిర్ధారించడంతో, యశ్ కుమార్ అదే తుపాకీతో తలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటి?

డిసిపి హర్షద్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనా స్థలంలో లభించిన రివాల్వర్‌లో రెండు తూటాలు మాత్రమే ఉన్నాయి, ఆ రెండూ వాడబడ్డాయి. ప్రమాదవశాత్తు తుపాకీ పేలే అవకాశం లేదని, ట్రిగ్గర్‌పై ఒత్తిడి పెంచితేనే కాల్పులు జరుగుతాయని పోలీసులు నిర్ధారించారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం ఆ దంపతులు బంధువుల ఇంటికి డిన్నర్‌కు వెళ్లి, తిరిగి వస్తూ జ్యూస్ కూడా తాగినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారి మధ్య ఇంట్లోకి వెళ్ళాక ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యశ్ కుమార్‌సిన్హ్ తల్లిని ప్రశ్నిస్తున్నామని, ఫోన్ కాల్ డేటా ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు