అమెరికాలో కూడా దీపావళికి అధికారిక సెలవు

లక్షలాది మంది ఇండో అమెరికన్ల కోరిక మేరకు దీపావళిని కాలిఫోర్నియా రాష్ట్ర అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ అసెంబ్లీ బిల్లుపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించిన 3వ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.

New Update
Diwali As Official Holiday

దీపావళికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం చారిత్రక గుర్తింపునిచ్చింది. లక్షలాది మంది ఇండో అమెరికన్ల కోరిక మేరకు, దీపావళిని ఇకపై రాష్ట్ర అధికారిక సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అసెంబ్లీ బిల్లు (AB 268)పై సంతకం చేశారు. దీంతో అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుగా ప్రకటించిన మూడవ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. అంతకుముందు పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు ఈ గుర్తింపును ఇచ్చాయి. వెస్ట్ కోస్ట్‌లో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియా కావడం విశేషం. ఈ చట్టం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.

గవర్నర్ న్యూసమ్ సంతకం చేసిన ఈ చట్టంతో దీపావళి రోజున రాష్ట్రంలోని పబ్లిక్ స్కూళ్లు, కమ్యూనిటీ కళాశాలలు మూసివేయడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకోవచ్చు.

ఈ బిల్లును అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా, డాక్టర్ దర్శన పటేల్ ప్రవేశపెట్టారు. "కాలిఫోర్నియాలో భారతీయ-అమెరికన్ జనాభా అత్యధికంగా ఉంది. దీపావళిని అధికారిక సెలవుగా ప్రకటించడం వలన ఈ పండుగ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించడమే కాకుండా, సద్భావన, శాంతి సందేశాన్ని కూడా ఇది అందిస్తుంది," అని ఆష్ కల్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక నిర్ణయం కాలిఫోర్నియాలో ఉన్న భారతీయ సమాజానికి, వారి సాంస్కృతిక వారసత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు.

Advertisment
తాజా కథనాలు