Jagan Kodi Katti Case: ఐదేళ్లపాటు ఉత్కంఠగా కొనసాగుతున్న వైఎస్ జగన్ (CM YS Jagan), శ్రీనివాసరావు (Srinivasa Rao) కోడికత్తి కేసులో ఎట్టకేలకు హైకోర్టు (High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూర్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు కోడికత్తి కేసు ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది? దీని వెనకాల జరిగిందేంటి? సూత్రధారులెవరు? అనే మిస్టరీ ఇంకా వీడలేదు. కానీ ఈ ఇష్యూలో ఉహించని ట్విస్టులు, మలుపులు సంతరించుకున్నాయి.
కేసు నేపథ్యం..
2018లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో (Vishaka Airport) జనపల్లి శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. అయితే అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్.. సిబిఐ కేసులో భాగంగా ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో కోర్టుకు హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని అక్టోబర్ 25న గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విశాఖ విమానాశ్రయం క్యాంటీన్‌లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేశారు. జగన్ ఎడమ భూజానికి గాయమవగా వెంటనే జగన్‌ను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు.
మొదటి బెయిల్ రద్దు..
ఈ క్రమంలోనే దాడికి పాల్పడిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫార్సుతో 2019 జనవరి 1న ఈ కేసును ఎన్‌ఐఏకి (NIA) బదిలీ చేశారు. అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ లభించింది. అయితే ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ వేసిన పిటిషన్‌ని కోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్ రద్దు అయింది. రెండు నెలల తర్వాత ఆగస్ట్ 13న నిందితుడు మళ్లీ జైలుకి వెళ్లారు. అప్పటి నుంచి జైల్లోనే ఉండగా.. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Dantewada: బస్తర్ లో కాల్పుల మోత.. మావోయిస్టు మృతి
జగన్ సాక్ష్యం చెప్పకుండా..
ఐతే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు నిందితుడు. అయితే న్యాయస్థానం నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ లేట్ చేస్తున్నారని, నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీనివాసరావు కీలక విషయాలు..
ఈ కేసులో ఎన్‌ఐఏ కోర్టు విచారణలో చార్జ్ షీట్, కౌంటర్‌తో పాటు ఈ-స్టేట్‍మెంట్‍ను ఎన్ఐఏ యాడ్ చేసింది. ఇందులో శ్రీనివాసరావు కీలక విషయాలను పేర్కొన్నాడు. తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని చెప్పాడు. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపాడు. ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై అటాక్ చేశానని తెలిపారు. దీంతో జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించినట్లు విచారణలో చెప్పాడు. ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించానన్నాడు. జగన్‍కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని చెప్పినట్టు పేర్కొన్నాడు. తన మాటలకు ఆయన చిరునవ్వు చిందించారన్నాడు. ఎయిర్ పోర్ట్‌లో అటాక్ జరిగిన వెంటనే వైసీపీ వారు నాపై దాడి చేస్తే పోలీసులు కాపాడి ఓ గదిలో బంధించినట్టు ఛార్జిషీట్‌లో వివరించాడు.
ఈ కేసులో శ్రీనివాస్‌ను బలిచేశారని ఇప్పటికే వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఈ అంశంపై ఇరుపార్టీ మధ్య మాటల యుద్దం జరిగే అవకాశముంది. ఐతే శ్రీనివాస్ మాత్రం దీని గురించి ఎక్కడా మాట్లాడకుండా.. కోర్టు ఆంక్షలు విధించింది.