Telangana : అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో విజయం సాధించిన నాటి నుంచి.. కాంగ్రెస్(Congress) నేతలు తెలంగాణ నుంచి రాహుల్, ప్రియాంక, సోనియాల్లో ఎవరో ఒకరు పోటీ చేయాలని కోరుతూ వచ్చారు. ఓ దశలో సోనియా గాంధీ మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఆమె రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఖమ్మం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. నామినేషన్లకు ఒక రోజు ముందు వరకు కూడా ఈ ప్రచారం కొనసాగింది. అయితే.. తెలంగాణ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది.. అదేంటో తెలుసుకుందాం..
వెంటాడిన ఎమర్జెన్సీ..
కాంగ్రెస్ పార్టీని దాదాపు 45 ఏళ్లుగా వెంటాడుతున్న సంఘటన ఎమర్జెన్సీ. అత్యంత పవర్ ఫుల్ పీఎంగా చెప్పబడే ఇందిరా గాంధీ(Indira Gandhi) ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఆమె ప్రతిష్ఠ మసకబారింది. అనంతరం జరిగిన 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో తన కంచుకోట అయిన రాయబరేలీ నుంచి బరిలోకి దిగిన ఇందిర కూడా ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. అయితే.. ఆ ఎన్నికల తర్వాత అధికారం దక్కించుకున్న జనతా పార్టీ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ ప్రభుత్వం పడిపోవడంతో 1980లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి కాకుండా మరో సేఫ్ సీటు నుంచి పోటీకి దిగాలని పార్టీ నేతలు ఇందిరా గాంధీకి సూచించారు.
ప్రచారం రాకపోయినా.. భారీ మెజార్టీ..
ఆ సమయంలో ఏపీ(Andhra Pradesh) లో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నారు. వారంతా మెదక్ నుంచి పోటీ చేయాలని ఇందిరను కోరారు. దీంతో ఆమె ఇక్కడి నుంచి పోటీకి అంగీకరించారు. మెదక్ నుంచి పోటీకి దిగినా.. ప్రచారం మాత్రం చేయలేకపోయారు ఇందిర. దీంతో ఆమె ప్రచార బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన బాగారెడ్డికి అప్పగించింది హైకమాండ్. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం సరికాదని భావించిన బాగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఊరూరు తిరిగి ప్రచారాన్ని అన్నీతానై ముందుండి నడిపారు. ఈ ఎన్నికల్లో ఇందిర 2 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఇందిరపై పోటీ చేసిందెవరంటే?
ఇందిరాగాంధీపై దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున పోటీ చేశారు. జైపాల్ రెడ్డికి ఆ ఎన్నికల్లో 82,453 ఓట్లు రాగా.. ఇందిరకు 3,01,577 ఓట్లు వచ్చాయి. అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు సార్లు కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. జైపాల్ రెడ్డితో పాటు ఇందిరపై పీవీ నరసింహారావు తనయుడు పీవీ రాజేశ్వరావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేశవ్ రావు జాదవ్, గణిత మేధావిగా చెప్పబడే శకుంతలా దేవి తదితరులు పోటీ చేశారు.
ఇందిర పోటీతో తెలంగాణలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..
ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని అన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. అప్పుడు ఇక్కడ మొత్తం 15 ఎంపీ సీట్లు ఉండగా.. అన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 42 సీట్లు ఉండగా.. 41 కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పార్వతీపురం నియోజవర్గం నుంచి కాంగ్రెస్ (యూ) అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్ విజయం సాధించారు. ఇందిరాగాంధీ పోటీ చేయడంతో ఆ ప్రభావం రాష్ట్రం అంతా ఉందని.. ఆ కారణంగా కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
మెదక్ పై ఇందిర ముద్ర..
విజయం సాధించిన తర్వాత ఇందిరాగాంధీ మెదక్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం తర్వాత ఆమె మాట్లాడుతూ.. సొంత ప్రాంతమైన రాయబరేలీ ప్రజలు తనను కేవలం 7 వేల మెజార్టీతో గెలిపిస్తే.. ఇక్కడి ప్రజలు నన్ను 2 లక్షలతో గెలిపించారని సంతోషంగా చెప్పారు ఇందిర. రాయబరేలీ సీటు వదులుకుని ఇక్కడి ప్రజల తరఫునే పార్లమెంట్ లో అడుగుపెడతానని ప్రకటించారు. తనను గెలిపించిన ఈ ప్రాంతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) తదితర సంస్థలు ఏర్పాటు చేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు ఇందిర.