IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ

ప్రపంచ కప్ ఫైనల్ అనంతరం ఆసిస్ తో ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. చాలా రోజులకు అసలైన క్రికెట్ మజాను ఫ్యాన్స్ ఆస్వాదించారు. చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరముండగా, ఆఖరు బంతికి సిక్సర్ బాది రింకూ జట్టుకు విజయాన్నందించాడు.

New Update
IND vs AUS: ఉత్కంఠ పోరులో భారత విజయం: చివరి బంతికి సిక్సర్ బాదిన రింకూ

IND vs AUS: చాలారోజుల అనంతరం అభిమానులు క్రికెట్ ఉత్కంఠను ఆస్వాదించారు. ఏకపక్షంగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‎ల నేపథ్యంలో గురువారం విశాఖలో జరిగిన మ్యాచ్ సిసలైన టీ 20 మజాను వీక్షకులకు అందించింది. చివరిబంతి వరకూ సాగిన మ్యాచ్ లో భారత్ సిక్సర్ తో విజయాన్నందుకుంది. టీ20 మ్యాచ్ అనగానే సూర్యకుమార్ యాదవ్ (80; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎప్పట్లాగే రెచ్చిపోయి ఆడాడు. ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ జళిపించడంతో భారత్ గెలుపు దిశగా పయనించింది. చివర్లో రింకూ మెరుపులు జట్టును గెలిపించాయి.

చివరి ఓవర్ లో విజయానికి ఏడు పరుగులు కావాల్సి ఉండగా క్రీజులో ఉన్న రింకూ సింగ్ తొలి బంతినే బౌండరీ దాటించాడు. అయితే, వెంటనే మరో ఎండ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను షేన్ అబ్బాట్ ఔట్ చేయడంతో భారత ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. తర్వాతి రెండు బంతులకూ భారత బ్యాట్స్ మెన్ రనౌట్ల రూపంలో వెనుదిరగడంతో ఉత్కంఠ పీక్స్ కు చేరింది. మొత్తానికి ఒక పరుగు అవసరమైన చివరి బంతికి రింకూ సిక్సర్ బాది మ్యాచ్ కు శుభం కార్డు వేశాడు.

ఇది కూడా చదవండి: భారత్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టిన ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు.. టార్గెట్ ఎంతంటే?

మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. వికెట్లు తియ్యలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ ధాటికి చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. 50 బంతుల్లో 110 పరుగులు చేశాడు జోష్‌. అటు భారత్‌ బౌలర్లలో ముఖేశ్‌, అక్షర్‌ మినహా మిగిలిన ముగ్గురు బౌలర్లు ఘోరంగా పరుగులు సమర్పించుకున్నారు.
చిచ్చర పిడుగు:
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. స్టీవ్‌ స్మిత్ ఓపెనర్‌గా రావడం విశేషం. స్మిత్‌కు జోడిగా షార్ట్‌ దిగాడు. 31 పరుగులు స్కోరు వద్ద తొలి వికెట్ పడింది. రవిబిష్ణోయ్‌ బౌలింగ్‌లో షార్ట్ బౌల్డ్‌ అయ్యాడు. 11 బంతుల్లో 13 రన్స్ చేశాడు షార్ట్. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జోష్‌ ఇంగ్లిస్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశాడు. భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు సిక్సర్లతో ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోష్‌ ఆ తర్వాత మరింత వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. వరుస పెట్టి ఫోర్లు కొట్టాడు. మరోవైపు హాఫ్‌ సెంచరీ చేసిన స్మిత్‌ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రనౌట్ అయ్యాడు. 41 బంతుల్లో 52 రన్స్ చేసిన స్మిత్ ఖాతాలో 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరు 130 పరుగుల పార్ట్‌నెర్‌షిప్‌ను నెలకోల్పారు.

అటు మరో ఎండ్‌లో భారత్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న జోష్‌ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు జోష్‌. ఆ తర్వాత ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో యశశ్వికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తంగా 50 బంతుల్లో 110 పరుగులు చేశాడు జోష్‌. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

జోష్‌ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చి స్టోయినిస్‌, టిమ్‌ డెవిడ్‌ కలిసి జట్టు స్కోరును 200 దాటేలా చేశారు. ఇక భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నాలుగు ఓవర్లలో రవి 54 రన్స్ సమర్పించుకుంటే.. అటు ప్రసిద్ద్‌ నాలుగు ఓవర్ల కోటాలో 50 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఆరో బౌలర్‌ లేకుండానే బరిలోకి దిగింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క బంతినీ ఎదుర్కోకుండానే రుతురాజ్ డైమండ్ డక్ గా వెనుదిరిగాడు. బౌండరీలు, సిక్సర్లతో ఊపు మీదున్నట్టు కనిపించిన యశస్వి జైశ్వాల్ మరికాసేపటికే మాథ్యూ షాట్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. భారత్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో ఇషాన్ కిషన్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. మొత్తం 42 బంతులు ఎదుర్కొన్న సూర్య 9 ఫోర్ల, 4సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. 134 పరుగుల వద్ద మూడో వికెట్ గా ఇషాన్ వెనుదిరిగాడు. అనంతరం కాసేపటికే తిలక్ వర్మ కూడా సంఘా బౌలింగ్ లో ఔటయ్యాడు. దాంతో మ్యాచ్ భారత్ చేజారినట్లనిపించింది. అయితే, క్రీజులో కుదురుకున్న రింకూసింగ్ క్రమం తప్పకుండా బౌండరీలు బాదడంతో మ్యాచ్ పై భారత్ పట్టు బిగించింది. కీలకమైన చివరి ఓవర్ లో 7 పరుగులు చేయాల్సి ఉండగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ రింకూ చివరి బంతికి సిక్సర్ తో జట్టుకు విజయాన్నందించాడు.

Advertisment
తాజా కథనాలు