G20 Summit: జీ20 సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి గావెల్ అందించి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల G20 సదస్సుని మోదీ ముగించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌లో వర్చువల్ G20 సమావేశాలు జరపనున్నట్టు ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ శాంతి కోసం ప్రార్థిద్దాం అని మోదీ ప్రతిపాదించారు.
ఈ సమావేశాల్లో మాట్లాడిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ దేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అంతా డిజిటల్‌దేనని తెలిపారు. AIతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దృష్టి పెడతామని ఆమె వెల్లడించారు.
గ్లోబల్ సౌత్ నినాదాన్ని వినిపించడంలో భారత్ సక్సెస్ అయిందని, ఢిల్లీ డిక్లరేషన్‌కి అందరూ ఆమోదం తెలపడం గొప్ప విషయమని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానే డుజర్రిక్ ప్రశంసించారు.
ఈ సెషన్ సందర్భంగా ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాకియో మొక్కలు బహుకరించారు.
ఈ సెషన్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీతో కలిసి దేశాధినేతలు అందరూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్దకు చేరుకుని మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు.
మరోవైపు ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో G20 సదస్సులో ఉన్న భారత్ మండపంలో వరద నీరు వచ్చి చేరిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలపై స్పందించిన పీఐబీ(PIB) ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ అంటూ స్పష్టం చేసింది.
ఇక జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఆదివారం అక్షరధామ్ ఆలయానికి చేరుకుని స్వామినారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం సందర్శకుల డైరీలో కొన్ని విశేషాలను రాసుకున్నారు. దర్శనానంతరం బ్రిటీష్ ప్రధాని ఆలయ సందర్శకుల డైరీలో వసుధైవ కుటుంబం స్ఫూర్తితో ఆలయ కమిటీకి, హాజరైన ప్రజల కోసం ప్రార్థిస్తున్నామని రాశారు. ప్రపంచం మొత్తం సామూహికంగా శాంతి, మతపరమైన శ్రేయస్సు, ప్రపంచ సామరస్యం వైపు వెళ్లేందుకు సహాయం చేయడంలో ఈ శిఖరాగ్ర సమావేశం అద్భుతమైన విజయం సాధించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: G20లో స్పెషల్ అట్రాక్షన్‌గా వాల్ పోస్టర్..ఇందులో ప్రత్యేకత ఏంటంటే..!!