Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి...భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! మనకు భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ గురించి తెలుసు. కానీ వారి వెన్నంటే నిలబడిన బాబీ (వదిన) గురించి కొద్ది మందికే తెలుసు. భగత్‌సింగ్‌ను కాపాడటం కోసం తన కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టిన విప్లవ వీరుల వదిన దుర్గావతీ దేవి గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి! By Bhavana 15 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Independence Day Special Story: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ వీర్..అంతా కూడా దుర్గా బాబీ అని ప్రేమగా పిలుచుకునే ఆమె..తన బిడ్డను పణంగా పెట్టి మరీ భగత్ సింగ్ ను కాపాడుకుంది. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో తుపాకీ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి (Durgawati Devi). బ్రిటిష్ అధికారి సాండర్స్ ను హత్య చేసిన భగత్ సింగ్ ను (Bhagat Singh) లాహోర్ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తింది... కానీ చరిత్ర పుటలలో కనుమరుగైపోయిన ఈ గొప్ప వనిత గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సైమన్ గోబ్యాక్ నిరసన కార్యక్రమం చేస్తున్న లాలా లజపతిరాయ్ మీద బ్రిటీష్ పోలీసుల లాఠీఛార్జీ జరిగి ఆయన ప్రాణం పోయింది. పంజాబ్ లో యువతకు మార్గదర్శిగా ఉన్న ఆ మహా నాయకుణ్ణి కోల్పోయినందుకు హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులకు ఆగ్రహం వచ్చింది. ఇది స్వాతంత్య్ర సమరయోధుడు భగవతి చరణ్ ఓహ్రా నడుపుతున్న గ్రూప్. చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అంతా కూడా ఇందులో సభ్యులే. వీరంతా కలిసి లాఠీఛార్జీని ఆర్డర్ వేసిన బ్రిటీష్ ఆఫీసర్ స్కాట్ ను చంపాలనుకున్నారు. నిర్ణయం అమలు చేయడమే ఆలస్యం. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఈ ముగ్గురు డిసెంబర్ 1928 న లాహోర్ లో పోలీసు ఆఫీసర్ స్కాట్ ను హతమార్చడానికి రెడీ అయ్యారు. అయితే బైక్ మీద రావాల్సిన స్కాట్ కారులో, కారులోనూ రావాల్సిన మరో ఆఫీసర్ సాండర్స్ బైక్ మీద రావడంతో అయోమయం నెలకొంది. అయినా సరే ఎదురుపడిన సాండర్స్ పై మొదట రాజ్‌గురు, ఆ తర్వాత భగత్ సింగ్ తుపాకీ పేల్చి అతణ్ణి చంపేశారు. లాహోర్ అంతా గగ్గోలు రేగింది. వందలాది మంది పోలీసులు అన్ని దారులు..బస్టాండ్లు..రైల్వే స్టేషన్లు అక్రమించారు. లాహోర్ లో ఉండటం భగత్ సింగ్ కు ఏ మాత్రం మంచిది కాదు. కానీ అతన్ని తప్పించేవారు ఎవరున్నారు. భగవతి చరణ్ ఓహ్రా సతీమణి దుర్గావతిని అందరూ దుర్గాబాబీ అని పిలిచేవారు. సాండర్స్‌ని హతమర్చాక భగత్ సింగ్, రాజ్‌గురు నేరుగా దుర్గావతి వద్దకు వచ్చారు. అప్పటికే ఆమె భర్త వేరే పని మీద కలకత్తా కి వెళ్లాడు. జరిగిన విషయం తెలుసుకున్న దుర్గావతి వెంటనే భగత్ సింగ్ ను లాహోర్ దాటించేందుకు సిద్దమైంది. జుట్టు కత్తిరించుకుని హ్యాట్ పెట్టి రూపం మార్చిన భగత్ కు ఆమె భార్యగా నటిస్తూ తన మూడేళ్ల కొడుకుతో సహా మరుసటి రోజు సాయంత్రం లాహోర్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ప్రయాణికురాలిగా బయల్దేరేలా చేసింది. కానీ ఈ ప్రయాణం చాలా ప్రమాదం. చేతిలో ఉన్న మూడేళ్ల కుమారుడికి కూడా ఏదైనా కావొచ్చు అని భగత్ ఆమెతో చెప్పాడు. నా కొడుకు ఇప్పుడు చనిపోతే ఓ దేశ భక్తునిగా తన ప్రాణం అర్పించే అవకాశం వాడికి దక్కుతుంది అని చెప్పి ఆమె ముందుకు కదిలింది. భగత్ సింగ్ ఆధునిక వేషంలో ఉన్న ఓ అధికారిగా...ఆమె అతని భార్యగా..రాజ్‌గురు నౌకరుగా ఆ ప్రయాణం చేశారు. బ్రిటీష్ వాళ్లకు ఏ మాత్రం అనుమానం రాలేదు. భగత్ సింగ్ ను అలా క్షేమంగా కలకత్తా చేర్చి వెనక్కి వచ్చింది. భగత్ సింగ్ ను కన్నబిడ్డలా భావించింది. భగత్ పార్లమెంట్ లో బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాక ఆ తర్వాత గానీ అతడే సాండర్స్ ని కూడా హత్య చేశాడని అధికారులు తెలుసుకున్నారు. ఆ కేసు వాదనలు అన్ని పూర్తి అయ్యాక భగత్ సింగ్ కు మరణశిక్ష విధించింది. భగత్ సింగ్ ను జైలు నుంచి రక్షించడానికి స్వదేశీ జ్ఙానంతో బాంబులు తయారు చేస్తూ ప్రమాదవశాత్తు భగవతి చరణ్ ఓహ్రా మరణించాడు. అంత కష్టాన్ని తట్టుకుని దేశం కోసం పోరాడాలనుకుంది. బొంబాయి వెళ్లి బ్రిటీష్ గవర్నర్ ను చంపాలనుకుంది. కానీ గవర్నర్ దొరకలేదు. దీంతో ఏం చేయలేక మరో అధికారి పై గుళ్ల వర్షాన్ని కురిపించింది. భగత్ ఉరి తరువాత తన వాళ్లంటూ ఎవరూ లేకపోయేసరికి తానే స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. మూడు సంవత్సరాల జైలు శిక్ష తరువాత పెద్దగా ప్రజల్లో ఉండకుండా..ఓ స్కూల్ ని నడుపుతూ..92 వ సంవత్సరంలో మరణించిన గొప్ప దేశభక్తురాలు..దుర్గాబాబీ. Also Read: రెండు రోజుల పాటు ఉరుములు..మెరుపులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ! #bhagat-singh #freedom-fighter #independence-day-2024 #durgawati-devi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి