IND vs ENG Test Matches: ఇంగ్లాండుతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జనవరి 25న మొదటి మ్యాచ్ జరగనుండగా.. విరాట్ (Virat Kohli) అభిమానులకు బీసీసీఐ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత కారణాల రిత్యా మొదటి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వైదొలిగినట్లు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
వ్యక్తిగత కారణాలు..
ఈ మేరకు 'దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని విరాట్ చెప్పాడు. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లతో విరాట్ చర్చించాడు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం’ అని బీసీసీఐ (BCCI) ట్వీట్ చేసింది. అలాగే బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ స్టార్ బ్యాటర్‌కు మద్ధతుగా ఉంటాయని చెబుతూ.. ఈ సమయంలో విరాట్ కోహ్లీ గోప్యతను గౌరవించాలని, అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు మానుకోవాలంటూ మీడియా, అభిమానులను కోరింది బీసీసీఐ.
ఉప్పల్‌లో ఫస్ట్ మ్యాచ్..
ఇక ఈ కోహ్లీ గైర్హాజరుతో అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయనుండగా.. మొదటి టెస్టు మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని (Hyderabad) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో టెస్ట్ మొదలవుతుంది. ఇక ఇప్పటికీ భారత్ తరఫున 113 టెస్టులు ఆడిన కోహ్లి 8,848 పరుగులతో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇది కూడా చదవండి : Rahul Gandhi: రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. గుడిలోకి అనుమతించని ఆలయ కమిటీ
మొదటి రెండు టెస్టులకు:
టీమిండియా (India):
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
ఇంగ్లాండ్ (England):
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే, రెహాన్ అహ్మద్, జేమ్స్ అండర్సన్, గుస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డాన్ లారెన్స్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్.