IMD Issues Red Alert : ఉత్తర భారత దేశాన్ని (East India) వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్ని కూడా జలమయం అవుతున్నాయి. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ క్రమంలోనే వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలున్న ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. గుజరాత్, అస్సాం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ నెల 4 వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
తమిళనాడు, బీహార్, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, గోవా వంటి రాష్ట్రాల్లో ఆరెంజ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.
రానున్న నాలుగు రోజుల్లో భారత్ లోని వాయవ్య తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశాలున్నట్లు ఐఎండీ (IMD) వివరించింది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం... అరుణాచల్ ప్రదేశ్ లో జులై 4,5 తేదీల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశాలున్నాయి.
త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో 2 వ తేదీన భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ పేర్కొంది.
గుజరాత్, ఉత్తరాఖండ్ అస్సాం, మేఘాలయాలో జులై 2 వ తేదీన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేరళ, లక్షద్వీప్, కోస్టల్ కర్ణాటక, కొంకణ్, గోవా, గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
కోస్తా, ఆంధ్ర, యానాం, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం (Heavy Rains) నమోదయ్యే అవకాశాలున్నాయి.