IIT Delhi : ఇటీవల దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఐఐటీల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత సమస్యలతోపాటు..చదువుల్లో పరీక్షల్లో రాణించకపోవడం వల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ (IIT Delhi) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని..వారిపై పరీక్షల భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పరీక్షా విధానంలో చాలా మార్పులు చేసింది.
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి మిడ్-సెమిస్టర్ పరీక్షల (Mid Semester Exam) సెట్‌ను రద్దు చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ రంగన్ బెనర్జీ తెలిపారు. పాఠ్యాంశాలు, కఠినమైన అధ్యయన షెడ్యూల్ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అనే చర్చకు దారితీసిన IITలలో అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇంతకుముందు మేము ఒక సెమిస్టర్‌లో రెండు సెట్ల పరీక్షలు, ప్రతి సెమిస్టర్ చివరిలో ఫైనల్ పరీక్షలు, అనేక నిరంతర మూల్యాంకన విధానాలు ఉండేవి. ఇప్పుడు అంతర్గత సర్వే నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఒక సెట్ ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరీక్షలు ఇప్పుడు సాధారణ మూల్యాంకనాలతోపాటు రెండు సెట్ల పరీక్షలు ఉంటాయని బెనర్జీ తెలిపారు.
విద్యార్థులపై భారం, ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయించుకున్నామని... ఈ నిర్ణయాన్ని సెనేట్ కూడా ఆమోదించిందని తెలిపారు. ఇప్పుడు జరగనున్న సెమిస్టర్ నుండి అమలు అవుతుందని తెలిపారు. గరిష్టంగా 80 శాతం వెయిటేజీని ఉంచినట్లు చెప్పారు. అలాగే ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంపొందేలా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో చదువుకునే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Also Read: ఎర్రకోట నుంచి ఈసారి ’10 కా దమ్’ ..మోదీ హయాంలో దేశ గ్రోత్ ఇంజన్ ఎంత పెరిగిందో తెలుసా..?