బొద్దింకలను చూస్తుంటే ఒకరమైన ఫీలింగ్ కలుగుతుంది. కొందరైతే వాటిని చూసి జంకుతుంటారు. ఉదయం ఎక్కడుంటాయో కానీ..రాత్రి మాత్రం కిచెన్, బెడ్రూం, బాత్రూమ్ అన్ని గదుల్లోనూ వాటి రాజ్యమే ఉంటుంది. ఇళ్లంతా తిరుగుతూ బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తుంటాయి. వంటగిన్నెలు, కూరగాయలు, పండ్లపై తిరుగుతూ సాల్మొనెల్లా, ఇకోలి బ్యాక్టిరియాలను వ్యాప్తి చేస్తుంటాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వంటగదిలో ఉంచిన ఆహారాన్ని పాడు చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, వీలైనంత త్వరగా వాటిని వదిలించుకోవడం చాలా ముఖ్యం. బొద్దింకలను వదిలించుకోవడానికి అనేక రకాల స్ప్రేలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఇంటి నివారణలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. బొద్దింకలను వదిలించుకోవడానికి ఇంట్లో కొన్ని పదార్థాలతో తరిమికొట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
లవంగాలు:
బొద్దింకలు వదిలించుకునేందుకు లవంగాలు బెస్ట్ హెం రెమెడీ అని చెప్పవచ్చు. దీనికి ఎలాంటి అదనపు శ్రమ అవసరం ఉండదు. బొద్దింకలు సంచరించే ప్రదేశంలో లవంగాలు పెడితే సరిపోతుంది.
బోరిక్ యాసిడ్:
బొద్దింకలను వదిలించుకోవడానికి బోరిక్ యాసిడ్ ఇంటి నివారణల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది అత్యంత ప్రభావవంతమైన ఇంటి నివారణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బొద్దింకలను వదిలించుకోవడానికి, బోరిక్ యాసిడ్ తీసుకొని ఇంటి మూలల కొద్దికొద్దిగా చల్లుకోండి. బొద్దింకలు తగిలి చనిపోయే వరకు ఈ ప్రదేశాల్లో వదిలేయండి.
బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా, పంచదార మిశ్రమం బొద్దింకల భయాన్ని ఆపడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. షుగర్ బొద్దింకలను ఆకర్షించడానికి పనిచేస్తుంది, అయితే బేకింగ్ సోడా వాటిని చంపుతుంది. మీరు ఈ రెండింటినీ సమాన పరిమాణంలో కలపండి. బొద్దింకలు దాచే ప్రదేశంలో ఉంచండి. బొద్దింకలు తిన్న వెంటనే చనిపోతాయి. చిన్న బొద్దింకలను వదిలించుకోవడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటి.
వేప:
ఇంట్లో నుంచి బొద్దింకలు, ఇతర క్రిములను నిర్మూలించేందుకువేపాకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో వేపాకులు ఉంచాలి. ఈ ఆకులను మారుస్తుండాలి. మూడు రోజుల్లో మీరు ఫలితాలను చూస్తారు. లేకుంటే రాత్రి పడుకుంటే ముందు బొద్దింకలు సంచరించే ప్రదేశాల్లో వేపొడి లేదంటే వేపనూనెను రాసుకోవాలి. బొద్దింకల గుడ్లను చంపేందుకు వేపనూనెలో కొంచెం వేడి నీళ్లు వేసి స్ప్రే చేయండి.
బిర్యానీ ఆకు:
బిర్యానీ ఆకులను పొడిగా చేసినా లేదా విడిగా ఆకులపైనా వేడి నీటిలో ఉడకపెట్టి..బొద్దింకలు సంచరించే చోట స్ప్రే చేయండి.ఈ వాసనకు బొద్దింకలు రావు.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క ఎంతో ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. దీనివల్ల బొద్దింకలు అలెర్జిక్ రియాక్షన్ వస్తుంది. దాల్చిన చెక్క పొడిని ఉప్పులో కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లాలి. ఇది బొద్దింకలు, వాటి గుడ్లను కూడా నాశనం చేస్తుంది.
కీరదోస:
దోసకాయ ముక్కలను ఎండబెట్టాలి. ఎండిన ముక్కలను కప్ బోర్డులలో ఆల్మారాల్లో ఉంచితే బొద్దింక బెడద నుంచి తప్పించుకోవచ్చు. కీరదోస వాసన బొద్దింకలకు నచ్చదు. తాజాగా ఉండే దోసకాయ తొక్క తీసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఆ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి.