Dry Ice: ఇటీవల గుర్గావ్‌లో కొందరు కస్టమర్లకు మౌత్ ఫ్రెషనర్‌కు బదులు పొరపాటున రెస్టారెంట్ సిబ్బంది డ్రై ఐస్ ఇవ్వడంతో అందరికీ నోటి నుంచి రక్తం వాంతులు అయ్యాయి. ఈ వార్త వైరల్‌గా కూడా మారింది. అసలు డ్రై ఐస్ అంటే ఏంటి?, నోట్లో వేసుకుంటే రక్తం ఎందుకు వస్తుంది.
గుర్గావ్‌లో అసలు ఏం జరిగింది?
- గుర్గావ్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. నిజానికి గుర్గావ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మౌత్ ఫ్రెషనర్‌కు బదులు డ్రై ఐస్ తినడంతో ఐదుగురు వ్యక్తుల నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. వెయిటర్ పొరపాటున మౌత్ ఫ్రెషనర్ బదులు డ్రై ఐస్ ఇచ్చాడు. ఇది తిన్న తర్వాత కస్టమర్లకు నోటిలో మంటతో పాటు రక్తస్రావం ప్రారంభమైంది. భోజనం చేసిన వారి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో డ్రై ఐస్ అంటే ఏంటి అనే చర్చ సర్వత్రా మొదలైంది.
డ్రై ఐస్ అంటే ఏమిటి?
- డ్రై ఐస్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఘన కార్బన్ డయాక్సైడ్‌తో తయారవుతుంది. మామూలుగా అయితే ఒక ఐస్‌ని నోట్లో ఉంచితే అది నెమ్మదిగా కరిగిపోతుంటుంది. సాధారణ ఐస్ కరిగిపోతే నీరుగా మారిపోతుంది. కానీ డ్రై ఐస్ కరిగిపోతే అది నేరుగా కార్బన్ డయాక్సైడ్ వాయువులో కలిసిపోతుంది. ఈ డ్రై ఐస్‌ను ఎక్కువగా మెడికల్ షాపులు, కిరాణాషాపుల్లో వస్తువులను నిల్వ చేయడానికి వాడుతారు. అంతేకాకుండా ఫొటోషూట్‌లు, థియేటర్లలో కూడా పొగ ఎఫెక్ట్ కోసం వాడుతుంటారు.
ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం:
- డ్రై ఐస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. అది తిన్న వెంటనే నోటి నిండా వ్యాపిస్తుంది. మంచు కరిగినట్లే ఇది కూడా కరిగి కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారుతుంది. అంతేకాకుండా ఇది నోటి చుట్టూ ఉన్న కణజాలాలకు చాలా నష్టం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి మూర్ఛపోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా మరణం కూడా సంభవిస్తుందని అంటున్నారు. డ్రై ఐస్‌ను చర్మానికి దూరంతా ఉంచాలని, ఒకవేళ ముట్టుకుంటే చేతికి గ్లౌజులు వేసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కార్బన్ డైయాక్సైడ్ వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వణుకు వంటి సమస్యలు వస్తాయని, కొన్నిసార్లు మనుషులు కోమాలోకి కూడా పోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఊబకాయం తగ్గించుకునేందుకు WHO చెప్పిన చిట్కాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.