Telangana Elections 2023: 2 వేల సంవత్సరాల నుంచి ఆకలి దప్పికతో ఉన్నాం.. ఇక బహుజన సమాజం తమ సత్తా చాటే సమయం వచ్చింది.. మన అధికారాన్ని మనమే చేపడదాం.. అంటూ బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరణిస్తే బొంద పెట్టేందుకు 6 అడుగుల జాగా కూడా దొరకని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు. దీనంతటికీ కారణం దొరల పాలనే అని విమర్శలు గుప్పించారు. బుధవారం నాడు.. బీఎస్పీ ఎన్నికల శంఖారావ సభను కొత్తగూడెం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బీఎస్‌పీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆర్‌ఎస్‌పీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి ఆర్ఎస్‌పీ.. కొత్తగూడెం గడ్డమీద మొట్టమొదటి బహుజనుల ఎన్నికల నగారా మోగిందని, అగ్ర వర్ణ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారీ ర్యాలీ నిర్వహించామన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ బిఎస్‌పి అభ్యర్థిగా యెర్రా కామేష్ ను ప్రకటించిన ఆర్ఎస్పీ.. మన బిడ్డను మనమే గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు పీక్స్‌కు చేరాయని, వారి కీచకపర్వం వర్ణనాతీతం అని విమర్శలు గుప్పించారు ఆర్ఎస్పీ. ఎమ్మెల్యే తనయుడి కారణంగా ఓ కుటుంబమే సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని, ఇలాంటి నేతలకు చరమగీతం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ.
This browser does not support the video element.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. సరైన సమయానికి ఫించన్, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందని విమర్శించారు. 15వ తేదీన పులి బయటకు వస్తారని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ. 170 కోట్లతో సీఎం కేసీఆర్ తన కోసం బంగళా ఏర్పాటు చేసుకున్నాడని విమర్శించారు ఆర్ఎస్పీ. తనకు చెందిన 300 ఎకరాల ఫాం హౌస్ పొలాలకు నీటి కోసం రాత్రికి రాత్రే ప్రభుత్వ సొమ్ము రూ. 2వేల కోట్లతో కొండపోచమ్మ సాగర్ చెరువును ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు ఆర్ఎస్పీ.
ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!
రాష్ట్రంలో ఉండడానికి ఇల్లు కూడా లేని ప్రజలు చాలా మందే ఉన్నారని, ఇంతవరకు వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొంగలని, ఓటుకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారంటూ ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు ఆర్ఎస్పీ. డబ్బులు పంచేందుకు వస్తే తరిమికొట్టండని పిలుపునిచ్చారు. వందలో 99 శాతం ఉన్న పేదల వద్ద ఎలాంటి సంపద లేని, ఒక్కశాతం ఉన్న ఈ దొంగల వద్దే 90 శాతం సంపద ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం త్యాగం చేసింది బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులే అని అన్నారు ఆర్ఎస్పీ. వనమా వెంకటేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అగ్ర వర్ణాల వారు పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రజలంతా ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. భూమి లేని నిరుపేదలకు ఎకరం భూమి రావాలన్నా.. 10 లక్షల ఉద్యోగాలు రావాలన్నా.. బహుజన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలన్నా.. ఏనుగు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు. గ్రామాల్లో లిక్కర్ షాపులు పోవాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ.
Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?