World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!

వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్‌, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు

New Update
World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!

ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma) జోన్‌లో ఆడుతున్నాడు. అంటే బాల్‌, ఫీల్డర్లు తప్ప ఇంకేమి అతనికి కనపడడం లేదు. కొడితే సిక్స్ లేకపోతే ఫోర్‌ అన్నట్టు సాగుతోంది హిట్‌మ్యాన్‌ విధ్వంసం. ఆస్ట్రేలియాపై జరిగిన వరల్డ్‌కప్‌ తొలి పోరులో రోహిత్‌ శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. రోహిత్‌కి హ్యాండ్‌ ఇవ్వడం అలవాటంటూ కొంతమంది లిమిట్ క్రాస్ చేసి మాట్లాడారు. అయినా రోహిత్ ఎప్పటిలాగే పట్టించుకోలేదు. కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడు.


ఎక్కడా తగ్గేదేలా:
తొలి మ్యాచ్‌ ఫెయిల్యూర్‌ తర్వాత ఢిల్లీ వేదికగా అఫ్ఘాన్‌ఫై మ్యాచ్‌ జరిగింది. అఫ్గాన్‌పై మ్యాచ్‌లో బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు రోహిత్‌. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు కొల్లగొట్టాడు రోహిత్. 63 బంతుల్లోనే సెంచరీ చేసిన హిట్‌మ్యాన్‌ వరల్డ్‌కప్‌లో ఇండియా తరుఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్‌కప్‌ హిస్టరీలో సచిన్‌ చేసిన ఆరు సెంచరీల రికార్డు చెరిగిపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్‌ దిగ్గజం గేల్‌ రికార్డును రోహిత్‌ బద్దలు కొట్టాడు. అదే సమయంలో ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్‌గా అవతరించాడు. వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ కూడా రోహిత్‌నే.


మరో రికార్డుకు దగ్గరలో రోహిత్‌:
ఈ మ్యాచ్‌తోనే రోహిత్ విధ్వంసం ఆగలేదు. పాకిస్థాన్‌పై పోరులోనూ రోహిత్‌ చెలరేగి ఆడాడు. పాక్‌ బౌలర్ల భరతం పడుతూ రెచ్చిపోయాడు. 63 బంతుల్లోనే 86 రన్స్ చేసి పాక్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో 300 సిక్సులు కంప్లీట్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. ప్రపంచ కప్‌ ఛేజింగ్‌లో ఏడు సార్లు భారత్ తరుఫున 50కు పైగా పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఎల్లుండు(అక్టోబర్ 19) బంగ్లాదేశ్‌(Bangladesh)తో టీమిండియా మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే రోహిత్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీలు చేశాడు రోహిత్‌. అక్టోబర్‌ 19న జరగనున్న మ్యాచ్‌లోనూ సెంచరీ చేస్తే బంగ్లాదేశ్‌పై వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా కొత్త రికార్డు సృష్టిస్తాడు రోహిత్.

ALSO READ: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డు వెనుక కారణం సచినే.. ఎలాగో తెలుసా?

Advertisment
తాజా కథనాలు