ICC WORLD CUP 2023: వికెట్లు తంతాడు.. స్టంపులను గిరాటేస్తాడు.. అంపైర్లను బూతులు తిడతాడు.. తనకు నచ్చిన విధంగా అంపైర్ నిర్ణయం ఉండాల్సిందే.. లేకపోతే మనోడికి తిక్క లేచిపోతుంది. క్రికెట్ అన్నది జెంటిల్‌మెన్ గేమ్.. తన్నుకోవడాలు. కొట్టుకోవడాలు.. తిట్టుకోవడాలు.. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటాయి. అవి జరిగినప్పుడు క్రికెట్ ప్రపంచమంతా వాటి గురించే మాట్లాడుకుంటుంది. కోపం మనిషి సహజ లక్షణమే కావొచ్చు.. కానీ అది హద్దు దాటితే ప్రజలు చిరాకు పడతారు. బంగ్లాదేశ్ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడైన ప్లేయర్ ఎవరంటే అందరి నోటా ముందుగా వచ్చే పేరు షకీబ్ అల్ హసన్. ఆల్‌రౌండర్‌గా బంగ్లాదేశ్‌కు గుండెలాంటి వాడు షకీబ్. ఈ విషయాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది కూడా. అయితే షకీబ్ ఆటగాడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో బ్యాడ్ బాయ్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకపై మ్యాచ్‌లో షకీబ్ తీరు మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇలా చేసి ఉండాల్సింది కాదు:
క్రికెట్ స్ఫూర్తిదాయకమైన గేమ్. క్రికెట్ నుంచి అభిమానులు ఎంతో నేర్చుకుంటారు. రూల్స్‌ని పక్కనపెట్టి మరి ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్ల విషయంలో స్పోర్టివ్‌గా ఆడుతుంటారు. ఇయన్ బెల్ రూల్స్ ప్రకారం అవుటైతే...నాటి ధోనీ టీమ్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుని బెల్‌ను మళ్లీ బ్యాటింగ్‌కు పిలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటి ఘటనలు అనేకం ఉన్నా.. రూల్స్‌ను యూజ్ చేసుకుంటూ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఆడిన ఆటగాళ్లూ ఉన్నారు. తాజాగా షకీబ్ అదే చేశాడు. 146ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ మొదటి సారి 'టైమ్ అవుట్' రూల్ ప్రకారం పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ఈ తరహా అవుట్‌కు తొలి బాధితుడు. అప్పడే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ హెల్మెట్ పట్టి ఊడిపోయింది. దాన్ని రిప్లేస్ చేసేలోపు 3నిమిషాల టైమ్ ముగిసింది. నిబంధనల ప్రకారం 3నిమిషాల్లోనే కొత్తగా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్‌కు రెడీగా ఉండాలి. మాథ్యూస్‌ను టైమ్ అవుట్‌గా ప్రకటించాలని బంగ్లాదేశ్ అప్పీల్ చేయడం.. అంపైర్ రూల్స్ ప్రకారం అవుట్‌గా ప్రకటించడం.. తర్వాత షకీబ్‌ను మాథ్యూస్ రిక్వెస్ట్ చేసుకోవడం.. షకీబ్ అంగీకరించకపోవడం చకాచకా జరిగిపోయాయి.
గతంలోనూ అంతే:
మాథ్యూస్ అవుట్ విషయంలో షకీబ్ వ్యవహరించిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. షకీబ్‌కు ఇక బుద్ధిరాదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ అనేకసార్లు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా షకీబ్ ప్రవర్తించాడు. 2021లో జరిగిన ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో అంపైర్‌పై చిందులేశాడు షకీబ్. అంపైర్ అవుట్ ఇవ్వలేదని వికెట్లను తన్నాడు. ఆ తర్వాత రెండు వికెట్లను లేపి కిందకేసి కొట్టాడు ఇక ఏడాది జనవరిలోనూ షకీబ్ ఇలానే చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అంపైర్‌ని కొట్టినంత పని చేశాడు. బ్యాటింగ్ చేస్తుండగా.. బాల్ అతని తలపై నుంచి వెళ్లింది. అంపైర్ వైడ్ ఇస్తాడని షకీబ్ భావించగా.. అంపైర్ ఫస్ట్ బౌన్స్‌గా ప్రకటించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన షకీబ్ వైడ్ ఇస్తావా లేదా అని అంపైర్ మీదకు వెళ్లాడు. ఇక ఇవాళ్టి మ్యాచ్‌లో గొడవైతే పడలేదు కానీ.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని ఫ్యాన్స్ తిడుతున్నారు.
Also Read: ఆస్ట్రేలియాకు కూడా సాధ్యంకాని రికార్డు ఇది.. టీమిండియాతో మాములుగా ఉండదు మరి!