శ్రీలంక(Srilanka) సభ్యత్వాన్ని ఐసీసీ(ICC) రద్దు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో చాలా కాలం పాటు మేటి జట్లలో ఒకటిగా నిలిచిన శ్రీలంకకు ఐసీసీ తీసుకున్న నిర్ణయం పెద్ద షాక్‌గానే చెప్పాలి. 1996 ప్రపంచకప్ విజేత శ్రీలంక ఇకపై ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే ఛాన్స్ లేదని తెలుస్తోంది. నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను ఐసీసీ ఇప్పటివరకు చెప్పలేదు. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక పాల్గొనే ఛాన్స్ లేదని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. క్రికెట్ బోర్డులో శ్రీలంక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఐసీసీ సమావేశంలో తేలింది. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ(Arjuna Ranatunga) చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.
అంతా జయ్ షానే చేస్తున్నాడు:
శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షానే అంటున్నాడు అర్జున రణతుంగ. శ్రీలంక క్రికెట్ అధికారులతో జయ్ షాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నాడు. వీరి మధ్య ఉన్న సంబంధం కారణంగా బీసీసీఐ శ్రీలంక బోర్డును తొక్కేస్తుందని చెబుతున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డును జయ్ షా నియంత్రించగలరనే భావనలో ఉన్నారని అర్జున రణతుంగ బాంబు పేల్చాడు.
ఆయనే నడిపిస్తున్నాడా?
శ్రీలంక బోర్డును నడిపిస్తున్నది జయ్ షానేనని అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలు అటు క్రికెట్ సర్కిల్స్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారాయి. జయ్ షా ఒత్తిడి కారణంగా శ్రీలంక క్రికెట్ నాశనమవుతోందని.. భారత్‌లో ఉంటూ జయ్ షా శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. కేంద్ర హోం మంత్రి కొడుకు కావడంతో జయ్ షా ఇంత పవర్‌ఫుల్‌గా మారాడని చెప్పుకొచ్చారు. ఇక 1996లో ప్రపంచకప్ విజేతైన శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించింది అర్జున రణతుంగనేనన్న విషయం తెలిసిందే. ఇక 2019లో జింబాబ్వేపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ఆఫ్రికన్ దేశం తర్వాత గత నాలుగేళ్లలో నిషేధించబడిన రెండో పూర్తి సభ్యదేశంగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక లాగానే జింబాబ్వే క్రికెట్‌లో కూడా ప్రభుత్వ జోక్యం పెరిగింది.
Also Read: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్ అలా చేయకు..!