వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లఘించిన కారణంగా ఆరేళ్లపాటు నిషేధం విధించింది. దీంతో 6 సంవత్సరాలపాటు ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదని తేల్చి చెప్పేసింది. ఈ నిషేధం నవంబర్11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై గత ఆగస్టులోనే శామ్యూల్స్‌ను ఐసీసీ దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు 2019 టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించాడంటూ శామ్యూల్స్ మీద అభియోగాలు నమోదయ్యాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించాడంటూ 2021 సెప్టెంబర్‌లో మొత్తం నాలుగు అభియోగాలను మార్లోన్ శామ్యూల్స్ మీద మోపారు. వీటిపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో శామ్యూల్స్‌ను దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే అన్నిరకాల క్రికెట్ వ్యవహారాల నుంచి శామ్యూల్స్‌ను ఆరేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ హెచ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్‌కు చెందిన అలెక్స్ మార్షల్ గురువారం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. 'శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతను అనేకసార్లు అవినీతి వ్యతిరేక సెషన్లలో పాల్గొన్నాడు. అవినీతి నిరోధక కోడ్‌ల ప్రకారం తన బాధ్యతలు ఏమిటో అతనికి కచ్చితంగా తెలుసు. అతను ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ నేరం జరిగిన సమయంలో అతను క్రికెట్‌లో పాల్గొనేవాడు. నిబంధనలను అతిక్రమించే ఉద్దేశం ఉన్నవారికి ఆరేళ్ల నిషేధం గట్టిగా హెచ్చరిస్తుంది' అని ఐసీసీ అధికారులు వెల్లడించారు.
Also read : సూర్య రియాలిటీని బయటపెట్టిన జ్యోతిక.. అందరిలాగే ఉంటాడంటూ
ఇక 2020 నవంబరులో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన శామ్యూల్స్.. తన 18 ఏళ్ల కెరీర్‌లో వెస్టిండీస్ తరుఫున దాదాపు 300లకు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌ల్లో 11134 పరుగులు చేశాడు. 152 వికెట్లు పడగొట్టాడు. 17 సెంచరీలున్నాయి. 2012, 2016లలో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు ఫైనల్ మ్యాచ్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచింది కూడా అతనే.