ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలివేటు పడింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తూ గవర్నమెంటు నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఉన్నత విద్యాశాఖా ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఎప్పటి నుంచి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారనేది ఇంకా తెలియలేదు.
తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే మొదట అక్కడ అధికారినే మార్చారు. ఎన్నికల తర్వాత పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఐఏఎస్‌లు చాలా మంది సెలవులపై వెళ్ళిపోయారు. వీరి స్థానంలో కొత్త వారు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారగానే టీటీడీ పాత ఈఓ ధర్మారెడ్డిని కూడా వారం రోజులపాటూ సెలవుపై పంపించారు. ఇంకా ఆయన సెలవు పూర్తవ్వకుండా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పాత ప్రభుత్వంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై చాలా ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు. తిరుమల దర్శనాల్లో అవతవకలు ఉండడమే కాకుండా..మొన్నటి సీఎం చంద్రబాబు దర్శనానికి కూడా యాన సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని...ముఖ్యమంత్రికి పాటించవలసిన ప్రోటోకాల్‌ను కూడా అనుసరించలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు టీటీడీ నుంచి ప్రక్షాళన చేస్తానని చెప్పడం అన్నట్టుగానే చర్యలు మొదలుపెట్టడం కూడా జరిగిపోయాయి.