Karnataka Home Minister Parameshwara: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) ఉదయనిధి స్టాలిన్ డెంగ్యూ,మలేరియా జబ్బులతో పోల్చడంతో దేశంలోని పలు హిందూ సంఘాలు,బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈతరుణంలోనే కర్నాటక హోంమంత్రి పరమేశ్వర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూధర్మం (Hindu Dharma) ఎప్పుడు పుట్టిందో తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. పరమేశ్వర వ్యాఖ్యలపై బీజేపీ, హిందూసంఘాలు మండిపడుతున్నాయి.
మంగళవారం తన నియోజకవర్గం కొరటగెరెలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారనే దానిపై ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పరమేశ్వర. వివిధ మతాలు, వాటి నేపథ్యాల గురించి మాట్లాడుతూ, హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదన్నారు. ఈ ప్రపంచంలో అనేక మతాలున్నాయి. హిందూ ధర్మం ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? అనేది ఇంకా సమాధానం దొరకని ప్రశ్న. బౌద్ధం పుట్టింది ఈ దేశంలో, జైన మతం కూడా ఇక్కడే పుట్టింది. ఇస్లాం, క్రైస్తవం బయటి నుండి వచ్చాయని పరమేశ్వర అన్నారు. పరమేశ్వర వ్యాఖ్యలపై పలువురు కర్ణాటక బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న మేఘాలు..!!
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టి పెట్టకుండా, పరమేశ్వర అసహ్యకరమైన ప్రకటన చేశారు. హిందూ మతానికి ఆధారం లేదని చెప్పడం నిజంగా అసమంజసమని, ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని మేము ఊహించలేదు. ఇది కాంగ్రెస్ మైండ్‌సెట్‌ను తెలియజేస్తోందని, ఒక నిర్దిష్ట వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని హిందూసంఘాలు మండిపడుతున్నాయి.
కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హోంమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. హిందూ సమాజాన్ని అపహాస్యం చేశారన్నారు. హిందూ మతం ఉనికిని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్య హిందూ మతాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. హిందూ మతం సముద్రం లాంటిదని, దానిని మరే ఇతర మతంతో పోల్చలేమన్నారు. హిందూ మతం అన్ని వర్గాల వారు గౌరవించే మతం. అనేక యుగాలుగా హిందూ మతాన్ని అనుసరిస్తున్నామని రవికుమార్ అన్నారు.
ఇది కూడా చదవండి: బాబోయ్ ఇంట్లోకి కింగ్ కోబ్రా.. తర్వాత ఏం జరిగిందంటే?
అటు పరిహారం కోసం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటూ జౌళి శాఖ మంత్రి శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలోని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హవేరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఆయనను తొలగించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివానంద్ పాటిల్ హావేరిలో విలేకరులతో మాట్లాడుతూ 2015తో పోలిస్తే ఆత్మహత్యలు పెరిగాయని, నష్టపరిహారం పెరగడం కూడా ఒక కారణమని అన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ‘నిజమైన’ కేసులకు పరిహారం అందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి తెలిపారు.