Elections: ఓటు వేసే సమయంలో వేసే సిరా ఎందుకు త్వరగా పోదు..అసలు దీని కథేంటి!

ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు.ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్‌ అంత త్వరగా చెరిగిపోదు..అసలు ఈ సిరా కథ..కమామిషు గురించి ఈ ఆర్టికల్‌ లో చదివేయండి.

Telangana: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతం ఎంతంటే
New Update

Elections: ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. చూపుడు వేలిపై సిరా గుర్తుని చూసే చాలా మంది ఓటు వేసినట్లు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా ఒకే వ్యక్తి ఎక్కువ సార్లు ఓటు వేయకుండా కూడా ఈ గుర్తు పట్టిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్‌ అంత త్వరగా చెరిగిపోదు...కాబట్టి ఎన్నికల అధికారులు కొన్ని దశాబ్దాలుగా ఎలక్షన్స్ సమయంలో ఈ సిరా గుర్తుని వినియోగిస్తున్నారు.

మరి ఇంత ఇలాంటి ఇంక్‌ ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? దీన్ని ఎవరు తయారు చేస్తారు? అసలు ఈ చెరిగిపోని సిరా వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ మళ్లీ వస్తుండటంతో వారిని ఎలా అడ్డుకోవాలో తెలియక ఎన్నికల అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఎంతగానో ఆలోచించి చేతి వేలిపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. అదే బ్లూ ఇంక్‌ పద్దతి. దొంగ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు తీసుకొచ్చిన ఈ బ్లూ ఇంక్‌ పద్ధతిని దశాబ్దాలుగా ఎన్నికల సంఘం అమలు చేస్తుంది.

తొలిసారిగా ఈ సిరాను 1962 ఎన్నికల్లో ఉపయోగించారు. సుకుమార్‌ సేన్‌ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అప్పట్నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరాను వాడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో రూ.33 కోట్ల ఖర్చుతో 26 లక్షల సిరా బాటిల్లను కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించింది. అయితే ఈసారి 26.55 లక్షల సిరా బాటిల్లను ఆర్డర్‌ చేసింది. దీనికోసం రూ.55 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఎన్నికల సంఘం ఆర్డర్‌ చేసిన సిరా బాటిల్‌ ఒక్కో దాంట్లో 10 మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై ఇంక్‌ గుర్తు పెట్టేయ్యోచ్చు.

ఓటు వేసిన వారి చూపుడు వేలిపై రాసే ఈ స్పెషల్‌ ఇంక్‌ను భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేయిస్తుంది. మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఒక్కటే ఈ ఇండెలబుల్‌ ఇంక్‌ను తయారు చేస్తుంది. దీని తయారీ ఫార్ములా చాలా రహస్యంగా ఉంటుంది. ఎంపీవీఎల్‌ డైరెక్టర్లకు కూడా ఈ ఫార్ములా తెలియదు. కేవలం సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఈ ఇంక్‌ తయారీ విధానం తెలుసు. రిటైర్మెంట్‌ లేదా అనుకోని కారణాలు ఏర్పడినప్పుడు మాత్రమే.. నమ్మకస్తులైన తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను వారు చెబుతారు.

ఈ సిరా తయారీకి సిల్వర్‌ నైట్రేట్‌ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్‌ నైట్రేట్‌ ఈ సిరాను ప్రకృతిలో ఫొటోసెన్సిటివ్‌గా చేస్తుంది. దీని కారణంగా సూర్మరశ్మి తాకినప్పుడు ఈ సిరా ముదురు రంగులోకి మాత్రమే మారుతుంది. ఈ సిరా వేలిపై పూసినప్పుడు గోధుమ రంగులో ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి.. ఆపై నల్లగా మారుతుంది. కాగా, ఈ సిరాలో వాడే సిల్వర్‌ నైట్రేట్‌.. మన శరీరంలోని ఉప్పుతో కలిసినప్పుడు అది సిల్వర్‌ క్లోరైడ్‌గా తయారవుతుంది. ఇది చర్మానికి అతుక్కుని ఉంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా తొలగించలేకుండా తయారవుతుంది. చర్మ కణాలు పాతబడి.. మృతకణాలు ఒక్కొక్కటిగా రాలిపోయినప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది.

Also read: నాకు వారసులు మీరే.. మోదీ ఎమోషనల్!

#elections #ec #ink #vote
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe