శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న నిందితులను అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను వేరు వేరు సందర్బాల్లో పట్టుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 4.8 కోట్లు వుంటుందని అధికారులు తెలిపారు. ఓ కేసులో బ్యాంకాక్ విమానం దిగి అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అదే విమానంలో వచ్చిన మరో వ్యక్తి లో దుస్తుల్లో బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 1.78 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఇక మరో కేసులో షార్జా నుంచి వస్తున్న ప్రయాణికున్ని అనుమానంతో చెక్ చేయగా అతని దగ్గర 2.17 కిలోల గోల్డ్ పేస్ట్ లభించింది.
నాలుగవ కేసులో దుబాయ్ నుంచి వచ్చి లో దుస్తుల్లో గోల్డ్ పేస్టు దాచి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి 2.05 కిలోల గోల్డ్ పేస్టును స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.