Warangal: భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త ఆ తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వరంగల్ లేబర్‌కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంద చరణ్ అలియాస్ చేరాలు(45) భార్య స్వప్న(40) దపతులకు పదేళ్ల క్రితం పెళ్లి జరగగా.. గ్రేసీ, మెర్సీ, కుమారుడు షాలోమ్ ముగ్గురు పిల్లలున్నారు. చరణ్ భవన నిర్మాణ కార్మికుడిగా, స్వప్న ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా వీరిద్దిరి మధ్య గొడవలు జరగడంతో చరణ్ మూడు నెలలుగా ఇంటికి రావడం లేదు.
ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చి..
ఈ క్రమంలోనే స్వప్నపై కోపం పెంచుకున్న చరణ్.. ప్లాన్ ప్రకారం సోమవారం ఇంటికి వచ్చిన చరణ్ సాయంత్రం పిల్లలను వరంగల్ ఉర్సు ప్రాంతంలోని స్వప్న పుట్టింటి వద్ద వదిలిపెట్టాడు. సోమవారం అర్ధరాత్రి రాత్రి తిరిగి వచ్చాక భార్యతో గొడవపడి రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం గదిలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు పట్టుబడతానన్న భయంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉర్సు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు విగతజీవులుగా ఉండటం చూసి భోరుమని విలపించడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్‌కాలనీ సీఐ మల్లయ్య ఘటనా స్థలికి చేరుకుని వారి మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరంలించినట్లు తెలిపారు. స్వప్న సోదరుడు సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇక దంపతుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలడం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల దయనీయ పరిస్థితిని చూసి చలించిన సీఐ మల్లయ్య ముగ్గురు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు విద్య చెప్పించే బాధ్యత తీసుకున్నారు. పిల్లలకు మృతుడు చరణ్ సోదరుడు కుమార్, తల్లి తరుపు బంధువులు పిల్లలకు బాసటగా నిలిచారు. స్థానిక కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, స్థానిక పెద్దలు మామిడాల రమేశ్‌బాబు, జన్ను వివేక్ బృందం పిల్లలకు ఆర్థికంగా అండగా నిలుస్తామి హామీ ఇచ్చారు.