Tirumala Tirupati : వారాంతంలోనే అనుకుంటే వారం మధ్య రోజుల్లో కూడా తిరుమల శ్రీవారి రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడే స్వామి వారిని 69, 733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వివరించింది. 28, 614 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం నేటితో ముగిసింది. కొత్త అధ్యక్షునిగా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పని చేసిన నాలుగేళ్లలో ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వామి వారి తొలి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు ఎంతో సంతృప్తినిచ్చాయని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఇతర సదుపాయాలు, వసతి మెరుగుపరచడంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రెండు నిర్ణయాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. నాలుగేళ్ల పాటు చైర్మన్ గా పని చేసే అదృష్టం ఇచ్చిన వెంకటేశ్వరస్వామి వారికి, తనకు అవకాశం ఇచ్చిన జగన్ కి తన వెన్నంటి ఉన్న ధర్మ కర్తల మండలి సభ్యులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు భార్గవి, వీర బ్రహ్మం, ఇతర అధికారులు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఙతలు తెలియజేశారు.
నూతన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుభవం..టీటీడీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా అధికారులు ఛైర్మన్ నాలుగేళ్ల పదవీకాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాకు బోర్డు నిర్ణయాలను వెల్లడించారు.
Also Read: వైసీపీలోకి జేపీ..క్లారిటీ ఇచ్చిన లోక్‌సత్తా ఏపీ అధ్యక్షుడు!