AP Weather: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. 143 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. గురువారం 47 మండలాల్లో తీవ్రవాడగాలులు ఉంటాయని, 19 మండలాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మంగళవారం విజయనగరం జిల్లాలో 22 మండలాల్లో, పార్వతీపురం మన్యంలోని 11 మండలాల్లో, శ్రీకాకుళంలోని 9 మండలాల్లో వడగాల్పులు వీచాయి. తూర్పు గోదావరిలో 17, కాకినాడలో 16, అనకాపల్లిలో 15, శ్రీకాకుళంలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10, ఏలూరులో 9, కోనసీమలో 7, విజయనగరంలో 4, పార్వతీపురం మన్యంలో 4, విశాఖపట్నంలోని 4 మండలాల్లో వడగాలులు వీచాయి. అంతేకాకుండా ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇవి తెలుసుకుంటే బంధాలు సుదీర్ఘకాలం కొనసాగుతాయి.