ఎస్సై ఫలితాల్లో అవకతవలకు జరిగాయనే కేసుపై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎస్సై నియామకాలపై ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసినట్లు తెలిపిన హైకోర్టు.. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎత్తు, కొలతల విషయంలో తప్పులు జరిగాయని అభ్యర్థుల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ విచారణలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు.. తాజాగా ఈ ఉత్తర్వులను ఎత్తివేసింది. అభ్యంతరం తెలిపిన అభ్యర్థుల ఎత్తు, కొలతలను న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించారు. నియామక బోర్డు కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో తీసుకున్న కొలతలు సరిపోవడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
Also read :‘యానిమల్’ మత్తు దిగకముందే.. మరో షూటింగ్ లో జాయిన్ అయిన రష్మిక!
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 56 వేల మంది దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరని 5 వేల మంది అభ్యర్థులను తిరస్కరించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అయితే, తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎస్సై నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఎస్సై అభ్యర్థులకు ఎత్తు, కొలతల అంశంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కోర్టుకు తెలిపారు. 45 వేల మంది అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్టే ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. తమ సమక్షంలో అభ్యర్థుల కొలతలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు బృందం సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు, కొలతలను కొలుస్తామని ప్రభుత్వం అంగీకరించింది. అయితే అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని కోర్టు హెచ్చరించింది. ఇవాళ జడ్జి సమక్షంలో ప్రభుత్వ వైద్యుడితో అభ్యర్థుల ఎత్తు కొలిచారు. అయితే అభ్యర్థుల ఎత్తు సరిపోవడంతో హైకోర్టు అభ్యర్థుల పిటిషన్ ను కొట్టివేసింది. 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించిన అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని బోర్డును ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది.