రాజధాని నగరం ఢిల్లీలో(Delhi) భారీ దోపిడీ జరిగింది. జంగ్‌పురా ఏరియా..భోగల్ ప్రాంతంలో ఉమ్రావ్ సింగ్ (umarv Singh) అనే నగల షాపులో భారీ దోపిడీ(Huge Robbery) చోటు చేసుకుంది. బంగారం షాపునకు కన్నం వేసిన దొంగలు సుమారు 25 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఎత్తుకుపోయారు. నగరంలో ఎక్కువ భద్రతా ఉండే ప్రదేవంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఉమ్రావ్ సింగ్ గోల్డ్ షోరూం అనేది మూడు అంతస్థుల భవనంలో ఉంది. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు మెట్ల మార్గం నుంచి షోరూం లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. గోడకు మనిషి పట్టేంత రంధ్రం చేసుకుని అందులో నుంచి లోనికి ప్రవేశించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
నగలు ఉంచే స్ట్రాంగ్ రూంలోనికి వెళ్లిన దొంగలు..అక్కడ ఉంచిన నగలు, వజ్రాలు, ఆభరణాలను మరికొన్ని సామాన్లను తీసుకుని వెళ్లారు. అయితే వీటితో పాటు అక్కడ ఉన్న వెండి వస్తువులను మాత్రం దుండగులు ముట్టుకోలేదు. దొంగలు ఎత్తుకు పోయిన సొమ్ము విలువ సుమారు రూ. 25 కోట్ల వరకు ఉంటుందని షోరూం యజమానులు తెలిపారు.
మంగళవారం ఉదయం షోరూం కి వచ్చిన యజమాని దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు వేలి ముద్రలు సేకరిస్తున్నారు.
బంగారం షాపు చుట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా షాపులో అలారం కూడా ఉంది. ఇంత పెద్ద దోపిడీ జరిగితే అలారం ఎందుకు పని చేయలేదు..అసలు ఎందుకు మోగలేదు అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. అదే విధంగా షోరూంలోని సీసీ కెమెరాలతో పాటు..ఆ వీధిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇంత పెద్ద దోపిడీ జరగడం ఇదే మొదటిసారి..అని పోలీసులు అంటున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.