Jarkhand: ఝార్ఖండ్ ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ఐదు నెలల తర్వాత తాను చట్టబద్ధంగా జైలు నుంచి బయటకు వచ్చానని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వల్ల శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.హేమంత్ జైలు నుంచి బయటకు రాగానే పెద్ద సంఖ్యలో జేఎంఎం మద్దతుదారులు అనుకూలంగా నినాదాలు చేశారు.
న్యాయవ్యవస్థతోపాటు మద్దతు తెలిపిన ప్రజలకు హేమంత్ భార్య కల్పన ధన్యవాదాలు తెలిపారు. తాను ఎందుకు జైలుకు వెళ్లానో దేశం మొత్తానికి తెలుసన్న హేమంత్, 5 నెలలుగా ఝార్ఖండ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. తన తప్పు లేకపోయినా బలవంతంగా జైల్లో పెట్టారని ఆరోపించారు.