దేశవ్యాప్తంగా వర్షాలు దండిగా పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అవడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ముంబైలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నట్లు తెలిపారు. మరోవైపు ముంబై నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది.
ఈ మేరకు మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
కాగా గత 24 గంటల్లో ముంబైలో 223.2 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో 153.5 మిల్లీమీటర్లు, రామమందిర్ ప్రాంతంలో 161 మి.మీటర్లు, బైకుల్లాలో 119 మిల్లీమీటర్లు, సియోన్ ప్రాంతంలో 112 మిల్లీమీటర్లు, బాంద్రాలో 106 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు.
రాబోయే 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏపీలో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీ సర్కార్ ముందస్తు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఈనెల 29న మొహర్రం పండగ ఉంది. దీంతో స్కూళ్లకు సెలవు ఉంటుంది. దీంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
తెలంగాణలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల్లోవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... శుక్రవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.