గత కొద్ది రోజులుగా తెలంగాణను వరుణుడు విడిచిపెట్టడం లేదు. గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఖమ్మంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలోని మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో మున్నేరు వాగు పై రాకపోకలు బంద్ అయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో ఉన్న చెరువులు పొంగడంతో ఆ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ గౌతమ్ అర్థరాత్రి సమయంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గౌతమ్ క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. వైరా జలశయం నిండుకుండలా మారింది.ఇప్పటికే నీటి మట్టం 17.8 అడుగులకు చేరింది.
ఎగువ నుంచి వస్తున్న వరద నీరు భారీగా జలాశయాలకు చేరడంతో నీటి మట్టం పెరుగుతోంది. చర్ల మండలంలోని తాళిపేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. ఇప్పటికే 15 గేట్లు ఎత్తి 1,15,956 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఇప్పటికే భద్రాచలం వద్ద 39.30 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.
ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లు సైతం నీట మునిగాయి. మురుగునీరు రోడ్ల మీదకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.