Floods : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ఏలూరు జిల్లా (Eluru District) లో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. వరద నీరు పోటెత్తడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.40 మీటర్లు వరకు చేరుకుంది. గంటకు 72,111 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా జలాశయం గేట్లు తెరచి 10,239 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు వదులుతున్నారు.
ఎర్ర కాలువ దిగువ ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, తాడేపల్లి గూడెం, నిడదవోలు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జంగారెడ్డి గూడెం గుబ్బల మంగమ్మ గుడి వద్ద గోదావరి పోటెత్తుతుంది. దీంతో అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు దర్శనాలను రద్దు చేసుకోవాలని తెలిపారు.
ఎర్ర కాలువ ఉగ్రరూపం..
కరాటం ఎర్రకాలువ జలాశయం నుంచి భారీగా వస్తున్న వరద నీరు కారణంగా నిడదవోలు మండలం కంసాలి పాలెం, రావిమెట్ల, సింగవరం గ్రామాలలో పంటలు ఎర్రకాలువ ముంపునకు గురి అయ్యాయి. కొన్ని వందల ఎకరాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముప్పునకు గురైన ప్రాంతాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పరిశీలించారు.
ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేష్ (Minister Durgesh) మాట్లాడుతూ తమది రైతుల ప్రభుత్వమని ఈ ఎర్ర కాలువ బారిన పడ్డ ప్రతి రైతుకు తమ కూటమి ప్రభుత్వం (Alliance Government) న్యాయం చేస్తుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని వరద నీటి ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలంటూ కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు.
Also read: అయ్యో బైడెన్ ఏంటి ఇది..భార్య అనుకుని వేరే మహిళకు!