Rains Effect: భారీ వర్షాల ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుంచి మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలీసులు..

Rains Effect: భారీ వర్షాల ఎఫెక్ట్: హైదరాబాద్-విజయవాడ హైవేపై నిలిచిన రాకపోకలు, భారీగా ట్రాఫిక్ జామ్
New Update

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు వరద నీటిలో జలదిగ్భందమయ్యాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలకే కాదు.. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుంచి మున్నేరు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలీసులు మళ్లిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి వైజాగ్ వయా విజయవాడ మీదుగా వెళ్లేవారు.. హైదరాబాద్‌ - నార్కట్‌పల్లి - మిర్యాలగూడ - దాడేపల్లి - పిడుగురాళ్ల -సత్తెనపల్లి - గుంటూరు - విజయవాడ - ఏలూరు - రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే విశాఖ నుంచి హైదరాబాద్ వయా విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు.. విశాఖపట్నం – రాజమండ్రి – ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ-దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి రూట్‌లో హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

దాదాపు 2008 తర్వాత ఈ ఏడాదే ఈ స్థాయిలో వరద విజయవాడ-హైదరాబాద్ హైవేపై వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 మీటర్ల మేర హైవే పై నీటి ప్రవాహం పెరిగినట్టు తెలిపారు అధికారులు. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. గతంలో మూడురోజుల పాటు ఇలానే వరద నీరు హైవే పై ప్రవహించినట్టు స్థానికులు చెబుతున్నమాట.. అయితే, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.

కాగా గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్ మంజూరు చేసింది.

ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు, అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

#vijayawada #traffic-stalled #rains-effect #heavy-rains-effect #highway #hyderabad-vijayawada-highway #hyderabad #heavy-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి