Heat Alert in India: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. చాలా ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. రాజస్థాన్ లోని బార్మర్ లో (Barmer) ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్, ఫలోడిలో 47.8 డిగ్రీలు, జైసల్మేర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గుణాలో 46.6 డిగ్రీలు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 45.9 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లోని ఒరాయ్‌లో 45 డిగ్రీలు, పంజాబ్‌లోని భటిండా, హర్యానాలోని సిర్సాలో 45.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: ఇక నుంచి యాద్రాద్రి టికెట్ల బుకింగ్ ఆన్ లైన్ లో!
అయితే.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత గురువారం కొంచెం తగ్గింది. ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు వాతావరణ శాఖ ‘రెడ్’ అలర్ట్ ను జారీ చేసింది. ఈ ఎండల వేడి వల్ల అనారోగ్యం, హీట్‌స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో రాబోయే మూడు రోజులలో రాత్రిళ్లు కూడా వేడిగా ఉంటాయని పేర్కొంది.