YS Sharmila in Delhi : వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బెంగుళూరు నుంచి డైరెక్ట్ గా హస్తినకు చేరుకున్నారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో ఆమె భేటీ అయి.. వైఎస్ఆర్ టీపీ విలీనానికి ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో డీకే పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె ఢిల్లీకి బయల్దేరారు.
ఈ రోజు షర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjun Kharge) కలిసే ఛాన్స్ ఉంది. మరి ఆమె ఏపి కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ లోకా అన్నది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా ఢిల్లీ బయల్దేరారు.
ఈ ఢిల్లీ టూర్ తో క్లారిటీ..
మొన్నటి వరకు బీఆర్ఎస్ (BRS) ను టార్గెట్ చేసిన షర్మిల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన వ్యూహాన్ని మార్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతున్న తరుణంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆమె చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి తోపాటు మరికొందరు సుముఖంగా లేకపోవడంతో ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వ్యవహారాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా మరోసారి డీకే శివకుమార్ తో కలిశారు. అయితే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని ప్రియాంకగాంధీ తరపున డీకేనే చూసుకుంటున్నారు.
అయితే షర్మిల పార్టీ విలీనం పై పావులు కదుపుతున్న డీకే శివకుమార్ ఆమెను ఢిల్లీ పెద్దల దగ్గరికి పంపారు. దీంతో ఆమె ఈ రోజు హస్తినలో.. ఖర్గేతో కలవబోతున్నారు. ఇక ఈ ఢిల్లీ టూర్ తో వైఎస్ షర్మిల పార్టీ విలీనం పై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
షర్మిలను నో అంటున్న తెలంగాణ కాంగ్రెస్..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిల పార్టీ విలీనాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.ఆమెను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం చేయాలని.. తెలంగాణలో వద్దని అంటున్నారు. దీని పై ఇప్పటికే రేవంత్ రెడ్డి బహిరంగం ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంలో ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాని డీకే శివకుమార్ తెలంగాణ నేతలతో చర్చించడంతో ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణ నేతలకున్న అభిప్రాయాన్ని ఆయన హైకమాండ్ ముందు పెట్టారు. మరి ఈ క్రమంలో వైఎస్ షర్మిల పార్టీ విలీనం పై పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఆమెను ఏపీకే పంపాలని హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం.