Hardik Pandya: అనేక ట్విస్టుల నడుమ ఐపీఎల్ కోసం వివిధ జట్లు తాజాగా రిటెన్షన్ లిస్టులను ప్రకటించాయి. హార్ధిక్ పాండ్యా ఏ జట్టుకు ఆడతాడన్న విషయంపై గుజరాత్, ముంబై టీంల మధ్య లాస్ట్ మినట్ వరకూ సస్పెన్స్ కొనసాగింది. చివరికి కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారమే నిజమై తిరిగి ముంబై జట్టుకు బదిలీ అయ్యాడు. ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ హార్ధిక్ పాండ్యాను దక్కించుకుంది.
ఇది కూడా చదవండి: ధోనీ ఫ్యాన్స్‌కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’
ముందుగా హార్ధిక్‌ను రిటైన్ చేసుకుంటున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. ఈ సారి ముంబై టీంకు హార్ధిక్ షిఫ్ట్ అవుతాడని భావించిన అందరూ దీంతో ఒకింత ఆశ్చర్యపోయారు. అయితే, రెండు గంటలు గడవకముందే తామే హార్దిక్‌ను దక్కించుకున్నామని ముంబై ఇండియన్స్ జట్టు ప్రకటించింది. ట్రేడింగ్ ద్వారా హార్ధిక్ ఆ జట్టులో చేరాడు. గుజరాత్ టైటన్స్‌కు రాకముందు హార్దిక్ ఆరేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫునే ఐపీఎల్ ఆడాడు.
ఇందుకోసం ముంబై యాజమాన్యం గుజరాత్ ఫ్రాంచైజీకి భారీ మొత్తం చెల్లించిందని తెలుస్తోంది. హార్దిక్‌కు చెల్లించే రూ.15 కోట్లతో పాటు రిలీజ్ కోసం భారీ మొత్తాన్ని ముంబై యాజమాన్యం గుజరాత్ కు చెల్లించనుంది. 2022లో హార్ధిక్ కెప్టెన్సీలో గుజరాత్ ఛాంపియన్‌గా అవతరించగా, మరుసటి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. అయితే, హార్దిక్ బదిలీ ఎపిసోడ్ పై క్రికెట్ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. గుజరాత్ యాజమాన్యంతో ఆర్ధిక పరమైన విభేదాల వల్లే తిరిగి హార్దిక్ ముంబై ఇండియన్స్ కు వచ్చాడని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు.