GT Mall Insident: ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ షాపింగ్ మాల్ సిబ్బంది అభ్యంతరకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పంచెకట్టుతో వచ్చాడని.. ఓ రైతును మాల్ లోపలికి రానివ్వలేదు. దీంతో రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. స్వల్ప ఉద్యమమే జరిగింది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు మాల్ ఏడు రోజుల పాటు మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంగళవారం మాగడి రోడ్డు జీటీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హావేరికి చెందిన ఫకీరప్ప అనే రైతును అక్కడి సెక్యూరిటీ గోపాల్ అడ్డుకున్నాడు. పంచె కట్టుకుని వచ్చిన ఆయన్ను లోపలికి అనుమతించలేదు. ఫకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు.