తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల సందర్భంగా మేం ప్రజలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మీ, రైతు భరోస, మహాలక్ష్మీ, గృహజ్యోతీ, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికారం, చేయూత ఈ ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం. మానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీకి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల లోపే రెండు గ్యారంటీలను అమలుచేసింది.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగానే ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. అలాగే రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అసైన్డ్, పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యచరణ తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపం, అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిస్తాం. కృష్ణానది జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ సాధించాలన్నది మా సంకల్పం.
Also Read: యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
యువతకు మేము ఇచ్చిన ప్రతిమాట నెరవేరుస్తాం. మెగా డీఎస్సీ నిర్వహించి వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం. టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తీసుకొచ్చే కార్యాచరణ మొదలైంది. భూ సంస్కరణలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై పేదలకు పూర్తిస్థాయి హక్కుల్ని కల్పిస్తాం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు నిర్మలించేందుకు మా ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉంది. రాష్టంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో.. ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. అణిచివేత, వివక్షకు గురైన ప్రతివర్గానికి మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని' తమిళిసై ప్రసంగించారు.