Loan Apps: టెక్నలజీ పెరుగుతోంది. దీంతో పాటు మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు చేబదులు కావాలంటే పక్కింటోళ్ళనో.. తోటి ఉద్యోగులనో.. ఇంకా ఎక్కువ కావాలంటే ఎవరైనా తెలిసిన వడ్డీ వ్యాపారి దగ్గరకో వెళ్లడం అందరికీ అలవాటు. టెక్నాలజీ ఆ అలవాటును పూర్తిగా మార్చేసింది. ఆన్ లైన్ లోనే అప్పులు ఇచ్చేవాళ్ళు పెరిగిపోయారు. ఆన్ లైన్ లోనే పేమెంట్స్ చేసేసే పరిస్థితి వచ్చేసింది. అవతల అప్పు ఇచ్చే వారి ముక్కూ మొహం మనకు తెలీదు. కానీ, వాట్సాప్ లో వచ్చిన ఒక మెసేజ్ చూసి దానిని క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకుని మన అన్ని వివరాలు దానికి సమర్పించేసి అవసరానికి కొద్దిగా డబ్బులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇదిగో ఇక్కడే అవసరాల మీద వ్యాపారం చేయడం పక్కన పెట్టి.. అవసరాన్ని అనుసరించి ప్రజల్ని ఎలా దోచేయాలో ప్లాన్ చేసుకున్నారు కొందరు. వారు టెక్నాలజీ సహాయంతో ఫైనాన్స్ యాప్స్(Loan Apps) రెడీ చేసి.. వాటికి ప్రచారం చేసి.. వాటిని డౌన్ లోడ్ చేసుకున్న వారిని ముంచేస్తున్నాయి. కొన్ని యాప్స్ అయితే, కొద్దిగా అప్పు ఇచ్చి.. ఆనక.. లెక్కకు మించి వడ్డీలు వేసి.. తీర్చలేని వారిని చావువైపు వెళ్లేలా హింసిస్తూ పెట్రేగి పోతున్నాయి. ఇలాంటి మోసపూరిత యాప్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.
Also Read: ఓయో రూములు అంటే.. ఓహొయ్ అంటున్న హైదరాబాదీలు.. దేశంలోనే ఎక్కువగా..
కేంద్రం తీసుకున్న చర్యలతో గూగుల్ ప్లే స్టోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆర్బీఐ అనుమతులు (RBI Permissions) లేని.. తప్పుడు మార్గాల్లో ప్రజలను దోచేస్తున్న యాప్స్ పై ఉక్కుపాదం మోపడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఏకంగా 2500 మోసపూరిత లోన్ యాప్స్ తొలగించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు. పార్లమెంట్ కు ఈ విషయంపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు మంత్రి. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య గూగుల్ ఈ చర్య తీసుకుందని ఆమె చెప్పారు.
మోసపూరిత లోన్ యాప్స్(Loan Apps) విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని.. ప్రజలను మోసం చేసే ఇటువంటి యాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు. ఈ విషయంలో ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చించి.. అవసరమైన చర్యల కోసం సిఫారసులు చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా నడుస్తున్న యాప్స్ వివరాలన్నీ ప్రభుత్వానికి ఆర్బీఐ అందించింది. వాటిని కేంద్ర లక్ట్రానిక్స్ అండ్ ఐటీశాఖ గూగుల్‌కు అందచేసింది. దీని ఆధారం గూగుల్ చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ విషయంలో గూగుల్ కూడా తన విధి విధానాలు పటిష్టం చేసి దేశంలో అమలులో ఉన్న కొత్త విధానంలో పర్మిషన్ ఉన్న యాప్స్ ను మాత్రమే తన ప్లే స్టోర్ లో పర్మిట్ చేస్తోందని మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (14సీ), కేంద్ర హోంశాఖ డిజిటల్ లోన్ యాప్‌లను పర్యవేక్షిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
Watch this interesting Video: