Gold Rate Today: దీపావళి పండుగ దగ్గరకు వచ్చేస్తోంది. బంగారం ధరలు కొన్నిరోజులుగా కిందికీ.. పైకీ కదులుతూ వస్తున్నాయి. గత మూడు రోజులుగా కొద్దీ కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే నవంబర్ 3న కాస్త పెరిగాయి. పండుగకు బంగారం కొనాలని భావిస్తున్నవారికి ఇది చేదు వార్తే అని చెప్పవచ్చు. నిన్నా, మొన్నా తగ్గుతున్న ధరలు చూసి సంబరపడిన వారికి ఈరోజు ధరలు పెరగడం బాధ కలిగించవచ్చు. ట్రేడ్ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం దీపావళి (Diwali) నాటికి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి గత మూడు రోజులుగా బంగారం ధరల ట్రేండింగ్ పరిశీలిస్తే.. అక్టోబర్ 30వ తేదీన పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 57,200లుగా ఉంది. ఇది తరువాత రెండు రోజులు తగ్గుతూ వచ్చి నిన్నటికి అంటే నవంబర్ 1వ తేదీన రూ.56,400లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు అక్టోబర్ 30 వ తేదీన రూ.62,400లు గా ఉండగా నవంబర్ 1 నాటికి రూ. 61,530లకు చేరుకుంది. ఇలా ధరలు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంటే బంగారం ప్రియులు సంతోషించారు.
అయితే, ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయింది. హైదరాబాద్ లో ఈరోజు బంగారం ప్రారంభ ధరలు 22 క్యారెట్లు 10 గ్రాములకు 100 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.56,500లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 110 రూపాయల పెరుగుదలతో రూ.61,640లుగా ఉంది.
ఇక అంతర్జాతీయ స్థాయిలోనే బంగారం ధరలు పెరుగుదల కనపర్చాయి. నిన్నటి ధరలతో పోలిస్తే లోన్సు బంగారం ధర 3 డాలర్ల వరకూ పెరిగింది. దీంతో ఇప్పుడు గోల్డ్ రేట్ ఔన్స్ కు 1986 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడం దేశీయంగానూ ప్రభావాన్ని చూపించింది. అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు ఈరోజు నిలకడగానే ఉన్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 56,650లుగా ఉండగా ఈరోజు కూడా అదే ధర ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్న రూ.61,790లుగా ఉండగా ఈరోజు కూడా అదే ధర వద్ద నిలకడగా ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర ఎటువంటి మార్పూ లేకుండా నిన్నటి ధర రూ.77,700ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందువల్ల బంగారం కొనే ముందు మార్కెట్ ధరలను పరిశీలించుకోవడం అవసరం.