Medaram : మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా మేడారానికి చేరుకున్నారు.

Medaram : మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క
New Update

Medaram Maha Jatara : మేడారం మహా జాతర(Medaram Maha Jatara) లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క(Sammakka) ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. బుధవారం సారలమ్మ తల్లి గద్దెలను వేంచేయగా.. గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెలను అధిష్టించడానికి బయలు దేరింది. ఆలయ పూజారులు సమ్మక్క అమ్మ వారిని..తమ సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మ వారిని తీసుకొని బయలు దేరారు. ముందుగా పూజారులు ఆదివాసి సాంప్రదాయ పద్ధతుల ప్రకారం చిలుకల గుట్ట దగ్గర సమ్మక్కకు పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. దీంతో చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెకు చేరుకొన్నారు.

సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ(Saralamma) ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. సారలమ్మను కొలువుదీర్చే క్రతువు ఉదయమే ప్రారంభమైంది. జాతర మొదటిరోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రం తోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి జనం తరలిరావడంతో మేడారం పరిసరాలు కిక్కెరిసి పోయాయి. వేల మంది భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు దీరడంతో క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి.

మేడారం మహాజాతరలో సమ్మక్క రాక ఒక అపూర్వఘట్టం. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించ డం ఆనవాయితీగా వస్తోంది. గిరిజన పూజారులు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చారు. ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.గిరిజన పూజారులు వనం గుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. సారలమ్మ కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు భారీ బందోబస్తు నడుమ గిరిజనపూజారులు సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్టించారు. అమ్మను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనగండ్ల నుంచి పగిడిద్దరాజును కూడా పూజారులు గద్దెలపైకి చేర్చి.. సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు.

Also Read : Medaram Jatara : ఆర్టీవీ మేడారం జాతర స్పెషల్!

సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారులు అడవి నుంచి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై ఉంచారు. సాయంత్రం ప్రధాన పూజారి నేతృత్వంలో పూజాలరుల బృందం చిలుకలగుట్ట అడవికి వెళ్లింది. అక్కడి నుంచి గుట్టుపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లారు. అక్కడ పూజా తంతు అంతా ఆనవాయితీ ప్రకారం గోప్యంగా సాగింది. ఆ తర్వాత తల్లిని తీసుకొని కిందికి దిగారు.కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట(Chilakala Gutta) దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకొని ఎదురు చూసిన యావత్ భక్తకోటి… ఆమె గుట్ట దిగగానే జేజేలు పలికారు. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది.

కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. మేడారం గద్దెపై కొలువుదీరనున్న ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించడానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది.

ఇక గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. ఇది జనమా – వనమా అనట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. ఇక జాతరలో మూడోరోజు గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు ఆనందానికి అవధులు ఉండవు.

Also Read : నేడు మేడారానికి సమక్క..జాతరలో అసలైన ఘట్టం

#minister-sithakka #medaram-jatara-2024 #sammakka-saralamma #telangana #medaram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe