Gobi Manchurian and Cotton Candy Banned in Karnataka: కర్ణాటకలో కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాను బ్యాన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విక్రయాలను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఉపయోగించే కృత్రిమ రంగులు, రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ (Dinesh Gundu Rao) ఇందుకు సంబంధించిన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీ కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ 10 లక్షల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీలో నాసిరకం నాణ్యత, కృత్రిమ రంగులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు తరలించినట్లు తెలిపారు.
Also Read: ముక్కూటమి కుదిరింది.. జనసేనానికి త్యాగమే మిగిలిందా?
గోబీ మంచూరియన్ నుంచి సేకరించిన 171 నమూనాల్లో 107 నమూనాల్లో కృత్రిమ రంగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా సేకరించిన 25 కాటన్ క్యాండీ నమూనాల్లో 15 నమూనాల్లో కృత్రిమ రంగులు కనిపించాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీలో రోడమైన్-బితో సహా నిషేధించబడిన కృత్రిమ రంగులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కృత్రిమ రంగులను కలిగి ఉన్న స్నాక్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఉండవచ్చని హెచ్చరించారు.