Israel Hamas War Updates: ఇజ్రాయెల్ పై మళ్లీ మళ్లీ దాడులు చేసితీరతామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ (Ghazi Hamad) స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకూ దాడులు ఆపేదేలేదని తేల్చి చెప్పారు. పాలస్తీనా భూభాగాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని, అప్పటి వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అరబ్ దేశాలకు, ముస్లిం దేశాలకు ముప్పుగా తయారైన ఇజ్రాయెల్ (Israel) ను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఓ ఇంటర్వ్యూలో ఘాజి హమాద్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ఇజ్రాయెల్ ను ప్రపంచ పటంలో నుంచి తొలగించాల్సిందేనన్నారు హమాస్ (Hamas) అధికార ప్రతినిధి ఘాజి హమాద్. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధానికి మూల్యం చెల్లించుకోవడానికి హమాస్ సిద్ధమేనని తెలిపారు. సామాన్య పౌరులకు హాని చేయడం హమాస్ లక్ష్యం కాదని హమాద్ స్పష్టతనిచ్చారు. అయితే, గ్రౌండ్ అటాక్ లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. అమరవీరుల దేశంగా పాలస్తీనా పేరొందిందని, దేశం కోసం అమరులయ్యేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని హమాద్ చెప్పారు. శత్రువుకు కచ్చితంగా గుణపాఠం చెప్పితీరతామన్నారు. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని ఇంటర్వ్యూ లో హెచ్చరించారు.
Also Read: ఘోర పడవ ప్రమాదం…18 మంది గల్లంతు..3 మృతదేహాలు లభ్యం!
ప్రస్తుతం ఇజ్రాయెల్ పై జరిపిన దాడి కేవలం ప్రారంభం మాత్రమేనన్నారు. ఇకపైనా కూడా దాడులు కొనసాగిస్తునే ఉంటామని వివరించారు. రెండు, మూడు, నాలుగు.. ఇలా దాడులు చేస్తునే ఉంటామన్నారు. అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు జరిపిన దారుణ ఊచకోతపైనా ..ఆ ఘటనలో సామాన్యుల మరణాలపైనా స్పందించాలని టీవీ యాంకర్ పదే పదే ప్రశ్నించారు. దీంతో ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్.