Varanasi Fight : వారణాసి లోక్‌సభ స్థానం(Lok Sabha Seat) నుంచి తమ అభ్యర్థిగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ ను కాంగ్రెస్(Congress) ప్రకటించింది. ఆయన వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పై పోటీ చేయనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీపై పోటీ చేశారు. రెండు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై అజయ్‌రాయ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAM) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కూడా ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లోనూ అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఎస్పీకి చెందిన షాలినీ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అజయ్ రాయ్ వారణాసి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టింది. ఈసారి ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.
బీజేపీ నుంచి మొదలు:
అజయ్ రాయ్ బీజేపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1996 నుంచి 2007 వరకు బీజేపీ(BJP) టికెట్‌పై వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో పార్టీ నుంచి లోక్‌సభ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ రాకపోవడంతో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2009లో ఇక్కడ ఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లోనే పింద్రా ప్రాంతం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2012లో కాంగ్రెస్‌లో చేరి పింద్రా స్థానం నుంచి గెలుపొందారు. ఇక అజయ్ రాయ్‌పై అనేక క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. వీటిలో గ్యాంగ్‌స్టర్ కేసులు కూడా ఉన్నాయి. 2015లో ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్టయ్యాడు. 2021లో ఈ క్రిమినల్ కేసుల కారణంగా ఆయన నాలుగు ఆయుధాల లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. ఆ సమయంలో అజయ్ రాయ్ ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేస్తూ అప్పటి డీఎం కౌశల్ రాజ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.
కులాల సంగతేంటి?
కుల సమీకరణం గురించి మాట్లాడితే వారణాసి(Varanasi) లో కుర్మీ సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. రోహనియా, సేవాపురిలలో ఈ క్యాస్ట్ ఓటర్లు ఎక్కువ. దీంతో పాటు బ్రాహ్మణులు, భూమిహార్ల సంఖ్య కూడా బాగానే ఉంది. యాదవేతర ఓబీసీలు మూడు లక్షలకు పైగా, కుర్మీ ఓటర్లు రెండు లక్షలకు పైగా ఉన్నారు. రెండు లక్షల మంది వైశ్యులు, రెండున్నర లక్షల మంది భూమిహార్ ఓటర్లు ఉన్నారు. ఇది కాకుండా లక్ష మంది యాదవులు, సుమారు లక్ష మంది షెడ్యూల్డ్ కులాల ఓటర్లు ఉన్నారు. ఇక అజయ్ రాయ్ భూమిహార్ క్యాస్ట్‌కు చెందిన నేత.
బీజేపీ ముందస్తు ప్లాన్:
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్‌రాయ్(Ajay Rai) పోటీ చేస్తారని బీజేపీకి ముందే తెలుసు. ఈ కారణంగా భూమిహార్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ ఇప్పటికే అనేక ఎత్తుగడలు వేసింది. ఇటీవల ధర్మేంద్ర సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. ధర్మేంద్ర భూమిహార్ కమ్యూనిటీకి చెందిన నేత. నగర ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో నివసిస్తున్నారు. ప్మోదీ ఎన్నికల సమన్వయకర్తగా సురేంద్ర నారాయణ్ సింగ్ నియమితులయ్యారు. ఆయన కూడా భూమిహార్ క్యాస్ట్‌కు చెందినవారే. రోహనియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సురేంద్ర నారాయణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో మోదీకి దాదాపు ఆరు లక్షల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కు దాదాపు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లోమోదీ గెలుపు సంఖ్య మరింత పెరిగింది. ఆయనకు ఏడున్నర లక్షల ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఎస్పీకి చెందిన షాలినీ యాదవ్‌కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి.
Also Read: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్ నోట్!