AP News: ఏపీలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద రహాదారిపై అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకే ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపాలని కోరారు. దీంతో ఆపినట్లే చేసిన దుండగులు.. వెంటనే సెకన్ లో వేగం పెంచి ముందుకు దూసుకెళ్లారు. అక్కడేవున్న డీఎస్పీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. డీఎస్సీ కారును తమ వాహనంతో బలంగా ఢీ కొట్టారు. దీంతో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
పట్టు వదలకుండా వెంబడించిన పోలీసులు..
ఈ క్రమంలోనే పారిపోతున్న దుండగులను పట్టుకునేందుకు పోలీసులు మరో కారులో వెంబడించారు. వెంటనే ఆ రూట్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన ఆత్మకూరు సీఐ గంగాధర్ వారి కారును ఫాలో అయ్యారు. అలా ఉదయం 4:30 గంటల వరకూ పట్టు వదలకుండా వెంబడించిన పోలీసులు కొనసముద్రం వద్ద ఎట్టకేలకు ముగ్గురిలో ఒకరిని పట్టుకున్నారు. ఇద్దరు పారిపోయారు. నిందితుడిని వెంటనే నెల్లూరుకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కారులో ఎన్ని కేజీల గంజాయి ఉందనే వివరాలు తెలియాల్సివుంది. విశాఖపట్నం నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.