నేడు హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఘటనంగా జరుగుతోంది. ఈ గణేష్ మహా నిమజ్జనానికి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీలో మరో 100 చోట్ల నిమజ్జనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ తోపాటు ఇతర నీటి కొలనుల వద్ద 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
ప్రయాణం సాఫీగా సాగేందుకు..
రెండు రోజులు ఈ సేవలను మెట్రో పొడిగించగా.. గురువారం ఉదయం 6 గంటలకే సేవలు ప్రారంభమైయ్యాయి. శుక్రవారం (రేపు) అర్ధరాత్రి 1 గంటల వరకు కొనసాగనున్నాయి. గణేష్ నిమజ్జన ఊరేగింపులలో పాల్గొనే వేలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. చివరి రైలు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 1 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి.. సుమారు 2 గంటలకు సంబంధిత గమ్యస్థానాలకు చేరుకుంటుందని ప్రకటించారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రయాణికులు భద్రతా సిబ్బందికి, మెట్రో సిబ్బందికి సహకరించాలని గణేష్ భక్తులను హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కోరారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. సిటీలో దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా.. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. హైదరాబాద్ మెట్రో తన సేవలు పొడిగించారు.
ఆర్టీసీ.. ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు అందుబాట్లో..
హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఇవాళ-రేపు.. దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. నిమజ్జనం సందర్భంగా.. ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అదేవిధంగా ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడపనున్నామని తెలిపారు. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలతో పాటు.. 79 అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం జలమండలి 10 లక్షల వాటర్ ప్యాకెట్లను రెడీ చేసింది. కాగా.. 35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ.. గణేశ్ నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యగా ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేయించారు. కొందరు ముస్లింలు మాత్రం అదే రోజున మిలాద్ ఉన్ నబీ ర్యాలీని జరపాలని పట్టుబడుతున్నారు. మహా గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీ మంత్రి పీఏ మాయం.. చనిపోయినట్లు నమ్మించి.. ఏం చేశాడంటే..?